స్వచ్ఛత దిశగా నగర అడుగులు..

స్వచ్ఛత దిశగా నగర అడుగులు..

“ఆపరేషన్ క్లీన్ స్వీప్”పై కమిషనర్ సూచనలు..

తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ (ఎఫ్.ఏ.సి.) శారదా దేవి పిలుపునిచ్చారు.

ఆదివారం ఉదయం వైకుంఠపురం మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన పారిశుధ్య కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమిషనర్, మే 22 నుంచి జూన్ 20 వరకు నాలుగు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

“స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర” లక్ష్యంతో పట్టణాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య పరిరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి వారం ప్రత్యేక అంశాలపై దృష్టి సారించి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ముఖ్యంగా మార్కెట్లు, ప్రధాన రహదారులు, కాలువల శుభ్రతతో పాటు ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం మునిసిపల్ పార్కును పరిశీలించిన కమిషనర్, పార్కును పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అలాగే విరిగిన ఆట పరికరాలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, శానిటరీ సూపర్‌వైజర్ చెంచయ్య, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply