అన్నప్రసాదంపై ప్రత్యేక పర్యవేక్షణ..

అన్నప్రసాదంపై ప్రత్యేక పర్యవేక్షణ..

భక్తులకు సేవలపై ఈవో సూచనలు..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో భక్తులకు అన్నప్రసాద వితరణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని దేవస్థానం ఈవో శ్రీనివాస్ రావు శివసేవకులకు సూచించారు.

ఆదివారం పరిపాలనా అంశాల పరిశీలనలో భాగంగా ఆయన అన్నప్రసాద వితరణ భవనం, విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని స్వయంగా వడ్డించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రసాద వితరణ, రుచి, సేవల నాణ్యతపై భక్తులతో మాట్లాడారు.

అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించాలని, వారికి తగిన అవగాహన కల్పించాలని ఈవో సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

ప్రతి హాలులో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వండిన ప్రతి వంటకం ప్రతి భక్తుడికి చేరేలా చూసుకోవాలని సూచించారు.

తాజా కూరగాయలను మాత్రమే ఉపయోగించాలని, ప్రసాదం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వంటశాల, ప్రసాద వితరణ హాలులు, ప్రాంగణంలో శుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈవో స్పష్టం చేశారు.

Leave a Reply