మహానాడు కోసం కొత్త వ్యూహం..

మహానాడు కోసం కొత్త వ్యూహం..
ఏలూరు, ఆంధ్రప్రభ : ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా భావించే తెలుగుదేశం పార్టీ ఇంధన పొదుపు సూత్రాన్ని పాటిస్తూ మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్లో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ చరిత్రాత్మక వైభవాన్ని స్మరించుకుంటూ, పార్టీ భవిష్యత్తును మరింత దృఢంగా నిర్మించుకునేందుకు మహానాడు వేదిక కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన అభివర్ణించారు.

ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు.
ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆన్లైన్ మహానాడు నిర్వహణ నిర్ణయం స్ఫూర్తిదాయకమని తెలిపారు.
ఏలూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తం 11 క్లస్టర్ల పరిధిలో ప్రతి కార్యకర్తను భాగస్వామిని చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
అందుకు అవసరమైన ప్రదేశాలను గుర్తించే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో ప్రతి కార్యకర్త తమ క్లస్టర్ పరిధిలో నిర్వహించే మహానాడు ఆన్లైన్ వేదికలో పాల్గొనాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.
