Bhogapuram Airport | సర్వాంగ సుందరంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్

Bhogapuram Airport | సర్వాంగ సుందరంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్
Bhogapuram Airport | రన్‌వే, టెర్మినల్ పనులు తుది దశలో
యంత్రాంగానికి సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
24 గంటల విమాన సర్వీసులకు మార్గం
జులై 5న ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం
Bhogapuram Airport | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఉత్తరాంధ్ర విహంగ భాగ్యరేఖగా నిలవనున్న విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చే శుభ ఘడియలకు సమయం ఆసన్నమైంది. జులై 8వ తేదీ నుంచి భోగాపురం నుంచి విమాన సర్వీసులు నడుస్తాయని సీఎం నారా చంద్రబాబునాయుడు వెల్లడించడంతో దీనికి మరింత బలం చేకూరింది. ఈ విషయమై ఇప్పటికే సింగపూర్ ఎయిర్లైన్స్ అనుబంధ సంస్థ స్కూట్ తన వెబ్సైట్లో ప్రకటించింది. ప్రస్తుత విశాఖ విమానాశ్రయం (వీటీజెడ్) నుంచి కాకుండా.. 50 కిలోమీటర్ల దూరంలో అధునాతనంగా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నడుస్తాయని సింగపూర్ తమ దేశ ప్రయాణికులకు ఎడ్వైజరీ జారీ చేసింది. ఇదే తరుణంలో సీఎం చంద్రబాబు సైతం జులై 8 నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయని ప్రకటించడంతో ఉత్తరాంధ్ర ప్రజల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.
సర్వాంగ సుందరంగా.. పనులు వడివడిగా
భోగాపురం విమానాశ్రయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే పోర్టులో 90 శాతం పనులు పూర్తయ్యాయి. జీఎంఆర్ నేతృత్వంలో రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ టవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విమానాశ్రయం ద్వారా ఉత్తరాంధ్రలో పర్యాటకం, ఐటీ, ఫార్మా రంగాలకు భారీగా పెట్టుబడులు రానున్నాయి. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల సరిహద్దుల్లో జీఎంఆర్ గ్రూప్ అత్యంత ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది.
1. రన్‌వే, ఎయిర్‌సైడ్ పనులు
విమానాల రాకపోకలకు అత్యంత కీలకమైన రన్‌వే నిర్మాణం దాదాపు పూర్తయింది. పెద్ద విమానాలు (వైడ్ బాడీ ఎయిర్ క్రాఫ్ట్) కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని రూపొందించారు. ట్యాక్సీవేలు, అప్రాన్ (విమానాల పార్కింగ్ స్థలం) పనులు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.
2. ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్
ఏపీ సంస్కృతి, కళలు ప్రతిబింబించేలా అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రయాణికుల చెక్-ఇన్ కౌంటర్లు, సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలు, లాంజ్లు, ఇమిగ్రేషన్ కౌంటర్ల ఏర్పాటు వేగంగా జరుగుతోంది. స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ కాన్సెప్ట్ డిజిటల్ సేవలను ఇక్కడ పరిచయం చేయనున్నారు.
3. ఏటీసీ టవర్, కార్గో కాంప్లెక్స్
విమానాల నియంత్రణకు కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ నిర్మాణం పూర్తయింది. దీనికి అవసరమైన అత్యాధునిక సిగ్నలింగ్, కమ్యూనికేషన్ పరికరాల అమరిక సాగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా భారీ కార్గో టెర్మినల్ కూడా సిద్ధమవుతోంది.
యంత్రాంగానికి సీఎం దిశానిర్దేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జులై 8ని డెడ్‌లైన్‌గా ప్రకటించడంతో యంత్రాంగం పనుల వేగాన్ని రెట్టింపు చేసింది. సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ ఇప్పటికే బుకింగ్స్, షెడ్యూల్ ప్రకటనకు సిద్ధమయిందంటే, సాంకేతికంగా విమానాశ్రయ పనులు క్లియరెన్స్ దశకు వచ్చాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
జూన్ నెలాఖరు నాటికి రన్‌వే కాలిబ్రేషన్, డమ్మీ ఫ్లైట్ ల్యాండింగ్ (ట్రయల్ రన్) నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) నుంచి తుది లైసెన్స్ సాధించేందుకు అవసరమైన పత్రాలు, భద్రతా ప్రమాణాల తనిఖీలు సమాంతరంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారి (ఎన్‌హెచ్-16) నుంచి విమానాశ్రయానికి ప్రయాణికులు సులభంగా చేరుకునేలా నిర్మిస్తున్న ఏడు ప్రత్యేక రహదార్ల పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి.
24 గంటలూ విమాన సర్వీసులు
భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర ఆర్థిక స్వరూపాన్ని మార్చే శతాబ్దపు ప్రాజెక్టు. విశాఖపట్నంలోని ప్రస్తుత ఎయిర్‌పోర్టు రక్షణ శాఖ (నేవీ) ఆధీనంలో ఉండటం వల్ల అంతర్జాతీయ సర్వీసులకు, రాత్రి వేళల రాకపోకలకు పరిమితులు ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం అందుబాటులోకి రావడం వల్ల 24 గంటలూ విమాన సర్వీసులు నడుస్తాయి.
సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో పాటు పలు దేశీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు భోగాపురం నుంచి సర్వీసులు నడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. జులై 8న ప్రారంభం కానున్న ఈ ఎయిర్‌పోర్టు ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకడం ఖాయంగా కనిపిస్తోంది.
జులై 5న ప్రధాని ప్రారంభించే అవకాశం
జూన్ నెలాఖరుకు భోగాపురం పనులు పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏడాది జులై 5 లేదా 8 లేదా ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ప్రారంభోత్సవానికి సమయం ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కోరింది. అయితే ఈ నాలుగు తేదీల్లో జులై 5న ప్రారంభించేందుకు ప్రధాని మోదీ మొగ్గుచూపినట్లు సమాచారం.
