Rayalaseema Railway Projects | రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టుల బలం

Rayalaseema Railway Projects | రాయలసీమ పారిశ్రామికాభివృద్ధికి రైల్వే ప్రాజెక్టుల బలం
Rayalaseema Railway Projects | కడప – బెంగుళూరు రైల్వే లైన్ గేమ్ ఛేంజర్‌గా మారుతోంది
రేణిగుంట – గుంతకల్లు నాలుగు లైన్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
అమృత్ భారత్ పథకంలో స్టేషన్ల ఆధునీకరణ
Rayalaseema Railway Projects | తిరుపతి (రాయలసీమ), ఆంధ్రప్రభ బ్యూరో: కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న డబుల్ ఇంజన్ సర్కార్ పుణ్యమా అని రాయలసీమ పరిధిలో వివిధ రైల్వే ప్రాజెక్టులు పరుగులు తీస్తున్నాయి. ప్రధాన గేమ్ ఛేంజర్‌లలో ఒకటిగా పేరొందిన రూ.2 వేల కోట్ల కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ పనులు ఊపందుకుంటున్నాయి. అత్యంత కీలకమైన రేణిగుంట – గుంతకల్లు మధ్య 4 లేన్ల రైల్వే లైన్ ప్రాజెక్టు మొదలయ్యే దశకు చేరుకోగా అమృత్ భారత్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన 5 జిల్లాల కేంద్ర స్థానాల్లోని స్టేషన్ల అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవికాక 30 చోట్ల ఎంతోకాలంగా నత్తనడక నడుస్తున్న డబ్లింగ్ పనులు, ఓవర్ బ్రిడ్జ్ పనులు, స్టేషన్ల సుందరీకరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి.
సుదీర్ఘ చరిత్ర కలిగిన రాయలసీమ ప్రాంతంలో బ్రిటిష్ పాలనలో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర హయాంలో మొదలైన పురాతన రైల్వే స్టేషన్లు ఎన్నో ఉన్నాయి. పలురకాల కారణాలతో రైల్వే పరమైన అభివృద్ధి మాత్రం ఆశించినంత వేగంగా జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పాలకులు ఇచ్చిన హామీల అమలులో కూడా ఆశించిన స్థాయి పురోగతి కనిపించలేదు. అయితే 2024లో కేంద్రంలో మూడవసారి అధికారంలో వచ్చిన బీజేపీతో పొత్తు కలిసిన తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టడంతో మార్పు మొదలైంది. కారణాలు ఏవైనా కేంద్ర, రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ కృషి ఫలితంగా ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడం ఎక్కువైంది. నత్తనడక నడుస్తున్న రైల్వే ప్రాజెక్టులు ఊపందుకోగా కొత్త ప్రాజెక్టులకు కూడా వేగం పెరిగింది.
ఈ ప్రాజెక్టు గేమ్ ఛేంజర్
ఈ క్రమంలో ఊపందుకున్న రూ.2 వేల కోట్ల కడప – బెంగుళూరు బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ ప్రాజెక్టుకు 2010లో అప్పటి రైల్వే మంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ శంకుస్థాపన చేశారు. రాయలసీమ ప్రాంత ప్రధాన గేమ్ ఛేంజర్‌గా చెప్పదగిన రాయచోటి – మదనపల్లె – కోలార్ మీదుగా వేసే 260 కిలోమీటర్ల రైల్వే లైన్ రాయలసీమ ప్రాంత పారిశ్రామికాభివృద్ధికి కీలకం కానుంది. అధికారిక సమాచారం ప్రకారం ప్రస్తుతం కడప – పెండ్లిమర్రి మధ్యలో 21 కిలోమీటర్ల పనులు పూర్తి అయి ట్రయల్ రన్ దశకు చేరినట్టు తెలుస్తోంది.
దీనికి అనుసంధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమభాగస్వామ్యంతో చేపట్టే ముద్దనూరు – ముదిగుబ్బ – పుట్టపర్తి, రాయచోటి – కదిరి – హిందూపురం మధ్య రెండు రైల్వే లైన్ పనులకు రైల్వే బోర్డు ఇటీవలే ఆమోద ముద్ర వేసింది. ఇందులోనే ముద్దనూరు – పులివెందుల మధ్య రైల్వే లైన్ వేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
ఇదొక స్పెషల్ రైల్వే ప్రాజెక్టు
అదేవిధంగా రేణిగుంట – గుంతకల్లు మధ్య ఉన్న రెండు లేన్ల రైల్వే లైన్లను మూడు, నాలుగు లైన్లుగా పెంచే రూ.5 వేల కోట్ల భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తిరుపతి, కడప, అనంతపురం జిల్లాల మీదుగా సాగే 307 కిలోమీటర్ల ప్రాజెక్టును స్పెషల్ రైల్వే ప్రాజెక్టుగా నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి అనుసంధానంగా ఓబులవారిపల్లె – కృష్ణపట్నం బ్రాంచ్ రైల్వే లైన్ కూడా రానుంది. ఇంకోవైపు రేణిగుంట – గూడూరు మధ్య 84 కిలోమీటర్ల 3వ రైల్వే లైన్ ప్రాజెక్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ పనులన్నీ రాయలసీమ పరిధిలో అంచెలంచెలుగా జరుగుతున్న ఓర్వకల్లు, కొప్పర్తి, శ్రీ సిటీ, తాడిపత్రి తదితర ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి రవాణా పరంగా కూడా ఉత్తమ ప్రయోజనకారి కానున్నాయి.
పురోగతిలోని రైల్వే లైన్లు..
ఇవికాక అమృత్ భారత్ ప్రాజెక్ట్ కింద దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు రైల్వే స్టేషన్లను అత్యాధునిక సౌకర్యాలతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ధర్మవరం – బళ్లారి, తాడిపత్రి – అనంతపురం, మంత్రాలయం – కర్నూలు, దూపాడు – బేతంచర్ల, ఏర్పేడు – పూడి రైల్వే లైన్ల పనులు, డోన్ – మహబూబ్‌నగర్, తిరుపతి – కాట్పాడి – పాకాల డబ్లింగ్ పనులు, గుంతకల్ – వాడి 3, 4 లైన్ల పనులు, కొత్త ముగులూరు – పాలసముద్రం బ్రాడ్ గేజ్ పనులు, గుంతకల్లులో రూ.90 కోట్లతో చేపట్టిన ఎలక్ట్రిక్ లోకో షెడ్ పనులు, కర్నూలులో మిడ్ లైన్ రీహాబిటేషన్ ఫ్యాక్టరీ పనులు కూడా వివిధ దశల్లో ఉన్నాయి.
వీటికి తోడు 30 చోట్ల రోడ్డు ఓవర్ బ్రిడ్జ్‌లు, స్టేషన్ల ఆధునీకరణ పనులు, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. రాయలసీమ పరిధిలో కొనసాగుతున్న వివిధ రైల్వే ప్రాజెక్టుల పనుల్లో మరో రెండు, మూడు ఏళ్లలో 70 శాతం పనులు పూర్తి అవుతాయని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
