అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం..

అన్నదాతల అభ్యున్నతే లక్ష్యం..

ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని పదర గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – అన్నదాతల అవగాహన సదస్సు” ముగింపు కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ , నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ రైతులను వానాకాలం సాగుకు సమాయత్తం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో రైతులకు ప్రత్యక్షంగా సూచనలు అందిస్తున్నారని చెప్పారు. జిల్లాలోని రైతు వేదికల్లో ఆరు వారాల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. యూరియా వినియోగాన్ని తగ్గించడం, నేల ఆరోగ్యాన్ని కాపాడటం, సాగునీటి పొదుపు, పంట మార్పిడి విధానం, నాణ్యమైన విత్తనాల వినియోగం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రశీదులు భద్రపరచుకోవాలని సూచించారు.

వ్యవసాయానికే పరిమితం కాకుండా అనుబంధ రంగాలపై కూడా రైతులు దృష్టి సారించేలా చైతన్యం కల్పిస్తున్నామని, లాభదాయకమైన పంటల ఎంపికతో రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. రైతుల ముంగిటకే శాస్త్రవేత్తలను తీసుకురావడం ద్వారా సాగు సంబంధిత సమస్యలకు తక్షణ పరిష్కారాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

Leave a Reply