నిర్వాసితుల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం

నిర్వాసితుల జీవన ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం
-జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ATR) కోర్ ప్రాంత గ్రామాల తొలి విడత పునరావాస ప్రక్రియపై జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించింది. కోర్ ఏరియాలోని గ్రామాల తరలింపు, భూ పట్టాల పంపిణీ, తొలి విడత నష్టపరిహారం చెల్లింపులు, పునరావాస కేంద్రాల అభివృద్ధి అంశాలపై బుధవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ పరిధిలో ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పునరావాస కుటుంబాలకు గృహ నిర్మాణ స్థలాలు కేటాయించడంతో పాటు, పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
పునరావాస కేంద్రంలో నివాస గృహాలు, రహదారులు, తాగునీటి వసతులు, విద్యా సంస్థలు, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత వంటి సదుపాయాలు సమగ్రంగా అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాలు కొత్త ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీవించేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలన్నారు.
నల్లమల అటవీ ప్రాంతంలోని టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా గ్రామాల కమిటీ సభ్యులు, నిర్వాసితుల పేర్లపై గృహ నిర్మాణ భూ పట్టాలను వెంటనే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రభుత్వం విడుదల చేసిన నిధులను ప్రజల అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని కోరారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, కమిటీ ఆమోదం అనంతరం అవసరమైన అన్ని చర్యలు వేగంగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో లబ్ధిదారుల పేర్లపై భూ పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అదేవిధంగా తొలి విడత నష్టపరిహారం చెల్లింపుల ప్రక్రియను కూడా పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. తరలింపు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పునరావాస కేంద్రాలు ఆదర్శవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, వివిధ శాఖల అధికారులు ఆర్టీవోలు ఆయా గ్రామాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

