హామీ ఇచ్చారు.. నెర‌వేర్చారు

హామీ ఇచ్చారు.. నెర‌వేర్చారు

మోత్కూర్ లో ‘కోతులు’ పడుతున్నారోచ్…!

  • ఎన్నికల హామీ నెరవేరుస్తున్న మున్సిపల్ పాలకవర్గం
  • ఒక్కో కోతికి రూ. 600
  • మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు రూ.3 లక్షలతో ప్రారంభం
  • కోతుల దాడులతో విసిగివేసారిన ప్రజలు
  • హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ మున్సిపల్ ప్రజలు

మోత్కూర్,మే 23 (ఆంధ్రప్రభ) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో కోతులతో ప్రజలు,వ్యాపారులు, రైతులు, గృహిణులు, విద్యార్థులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు తమ నిత్య జీవితంలో రోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏ వార్డులో కౌన్సిలర్లు ప్రచారానికి వెళ్ళితే ఆయా కాలని ప్రజలు కోతుల బాధ తీర్చండి మహా ప్రభో..అంటూ వచ్చిన ప్రతి అభ్యర్థులకు,అధికారులకు,ఎమ్మెల్యే, ఎంపీ ఇలా ప్రతి ఒక్కరికి విన్నవించారు. కానీ కోతుల నియంత్రణ లో ఎవ్వరు కూడా ఏమి చేయలేకపోయారు. ఇటీవల పలు పార్టీల , వినియోగదారుల సంఘాల ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వయంగా కలెక్టర్ ని కలిసి విన్నవించారు. స్పందించిన కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ని ఆదేశించడంతో కౌన్సిల్ తీర్మానం మేరకు మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు రూ.3 లక్షల తో (ఒక్కో కోతికి రూ.600 చొప్పున) తొలి విడతగా నూతన మున్సిపల్ పాలకవర్గం ఒక అడుగు ముందుకు వేసి శనివారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోతుల పట్టె కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య, కమిషనర్ సతీష్ కుమార్, ఆయా వార్డుల కౌన్సిలర్ల సమక్షంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ స్వప్న సోమనర్సయ్య మాట్లాడుతూ మోత్కూర్ లో మనుషుల జనాభా కంటే ..కోతుల జనాభా అధికం అవుతోందోనని ప్రజల కోరిక మేరకు కోతుల నియంత్రణకై శ్రీకారం చుట్టామన్నారు.మున్సిపాలిటీ లోని 12 వార్డులలో కోతులు పట్టె కార్యక్రమం కొనసాగుతుందన్నారు.ఎన్నో ఏళ్లుగా ప్రజలు కోతుల దాడులతో నిత్యం ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ ఎన్నికల్లో తమ దృష్టికి తెచ్చారని,తనతో సహా ఆయా కౌన్సిలర్లు సైతం అన్ని వార్డులలో కోతుల నివారణకు ప్రజలకు హామీ ఇచ్చామని,ప్రస్తుతం ప్రజలకిచ్చిన హామీని నెరవేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.మోత్కూర్ లో ప్రస్తుతం హై స్కూల్,ఆరేగూడెం, పోతాయి గడ్డ ఏరియాల్లో కోతులను జాలీలలో బంధించి, ఇలా పట్టిన ఈ కోతులను అటవీ ప్రాంతానికి తరలించనున్నారు.విడతల వారీగా మున్సిపాలిటీ లోని 12 వార్డులలో కోతులు పట్టించనున్నట్లు కమిషనర్ సతీష్ కుమార్ తెలిపారు. ఏది ఏమైనాప్పటికీ మున్సిపాలిటీ పరిధిలో కోతులు పట్టిస్తుండంతో మున్సిపల్ ప్రజలు, ఆయా కాలనీ వాసులు రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply