99.55cr.development | యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

99.55cr.development | యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
99.55cr.development | వేద పాఠశాలకు భూమిపూజ
యాదాద్రి నర్సన్నను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
99.55cr.development | ఆంధ్రప్రభ, ప్రతినిధి, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రంలో శుక్రవారం ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా దేవస్థానంలో ఘనంగా వేద పాఠశాల భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.కంచికామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమం భక్తి భావాన్ని మరింత పెంచింది.అనంతరం యాదగిరిగుట్ట దేవస్థాన పరిధిలో రూ.99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ఈ పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనులు రూ.43.80 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం,రూ.9.87 కోట్లతో స్వామివారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం,రూ.1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు నిర్మాణం,రూ.1.35 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణం,రూ.43.12 కోట్లతో డార్మిటరీ హాల్స్, దీక్షాపరుల సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విఫ్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, దేవాదయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావ్, ఆలయ ఈవో భవాని శంకర్, ఉన్నతాధికారులు, దేవస్థాన అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భారీ గందరగోళం..!
15 నిమిషాల పాటు చాపర్‌లోనే సీఎం, మంత్రులు
అధికార యంత్రాంగంపై సచివాలయం సీరియస్..?
యాదాద్రి పర్యటనకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో అధికార యంత్రాంగం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పర్యటన వంటి అత్యంత ప్రాధాన్య కార్యక్రమంలో జిల్లా యంత్రాంగం సమన్వయ లోపం బహిర్గతం కావడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం సీఎం హెలికాప్టర్ కొండ కింద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌లో దిగాల్సి ఉండగా, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు అక్కడే సీఎం రాక కోసం వేచిచూశారు. అయితే చివరి క్షణంలో అనూహ్యంగా సీఎం చాపర్ టెంపుల్ సిటీ పైన ఉన్న పెద్దగుట్ట హెలిపాడ్‌లో ల్యాండ్ అయింది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం వేద పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి నేరుగా పెద్దగుట్టకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు అక్కడ ఎటువంటి స్వాగత ఏర్పాట్లు లేకపోవడం గమనార్హంగా మారింది.
హెలిపాడ్ వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో ముఖ్యమంత్రి, మంత్రులు దాదాపు 15 నిమిషాల పాటు చాపర్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం.సీఎం రాకపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ స్థానిక కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం సమయానికి స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది.అనంతరం సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన హెలిపాడ్‌కు చేరుకున్నప్పటికీ అప్పటికే పరిస్థితి గందరగోళంగా మారినట్లు తెలిసింది.
ముఖ్యమంత్రి పర్యటనలో చోటుచేసుకున్న ఈ పరిణామంపై సచివాలయ వర్గాలు సీరియస్‌గా స్పందించినట్లు సమాచారం.సీఎం భద్రత, ప్రోటోకాల్ విషయంలో ఇలాంటి నిర్లక్ష్యం ఎలా జరిగిందనే అంశంపై ఉన్నతస్థాయిలో ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటనతో యాదాద్రి జిల్లా అధికార యంత్రాంగం పనితీరుపై రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.










click here to read భక్తజన సందోహంతో పులకించిన పుష్కర క్షేత్రం
