చీపురుపట్టి రోడ్డు ఊడ్చిన ఇన్ఛార్జ్ కలెక్టర్
చీపురుపట్టి రోడ్డు ఊడ్చిన ఇన్ఛార్జ్ కలెక్టర్
ప్రారంభమైన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : నగరం రూపురేఖలు మార్చేందుకు ప్రతీ బాధ్యత తీసుకోవాలని ఇన్ చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. చీపురుపట్టి శనివారం రోడ్డును క్లీన్ చేశారు. మే 23 నుండి జూన్ 20 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద శనివారం జెండా ఊపి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పారిశుధ్యం మెరుగుదలకై ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. మే 23 నుండి జూన్ 20వ తేదీ వరకు నిర్వహించే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం రోజులు నగరంలోని రహదారులు , బ్లాక్ స్పాట్స్, ఎల్లో, రెడ్ స్పాట్స్ క్లీనింగ్ చేయనున్నట్లు తెలిపారు . రెండవ వారంలో మురుగునీటి కాలువలు, వరద నీటి కాలువలలో పూడిక తొలగించడం జరుగుతుందని తెలిపారు.

మూడో వారంలో చెత్త వర్గీకరణ పై ప్రజలకు అవగాహన, వాణిజ్య ప్రాంతాలలో ప్రత్యేక పారిశుధ్యం పై దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. నాలుగో వారంలో సామూహిక మరుగుదొడ్లు నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పారిశుధ్య కార్మికులు ఉదయాన్నే ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరణకు వచ్చినపుడు చెత్తను వారికి అందజేయాలన్నారు. నగరాన్ని అందంగా తీర్చి దిద్దాలంటే అందుకు ప్రతీ ఒక్కరి సహాయ సహకారాలు అవసరమన్నారు. చెత్తను కాలువల్లో వేయరాదన్నారు. నగరంలో గల షాపుల యాజమాన్యాలు షాపుల నుండి వచ్చిన చెత్తను రోడ్డు పై వేయరాదని, ప్రతి ఒక్క షాపు యజమాని షాపుల్లో డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకొని చెత్త సేకరణకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు వచ్చినపుడు చెత్త అందజేయాలన్నారు.
స్థానిక శాసన సభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్, తదితర కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకుందామన్నారు. అందరు సహకరించాలని కోరారు. చెత్తను రోడ్లపై వేయరాదన్నారు. ఉదయాన్నే ఇంటింటికీ వచ్చే పారిశుధ్య కార్మికులకు చెత్తను అందజేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు మాట్లాడుతూ, ఆపరేషన్ క్లీన్ స్వీప్ మే 23వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు ఉంటుందన్నారు.
నాలుగు వారాలపాటు వివిధ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఎ పిడి కిరణ్ కుమార్, డ్వామా పీడీ లవరాజు, ఉద్యానవన శాఖ ఎడి వర ప్రసాద్, వివిధ జెసిఐ, లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
