విద్యార్థుల ప్రతిభకు వేదికగా చెస్ టోర్నమెంట్

విద్యార్థుల ప్రతిభకు వేదికగా చెస్ టోర్నమెంట్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం నియోజకవర్గ పరిధిలోని పెద్దపాడు సమీపంలోని గ్రాండ్ హోటల్లో ఇంటర్నేషనల్ ఫైట్ రేటెడ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ మంగళవారం నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది రేటెడ్ క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెస్ ఆట ప్రాముఖ్యతపై మాట్లాడారు.
చెస్ అనేది కేవలం ఆట మాత్రమే కాకుండా మేధస్సును పదును పెట్టే ఒక శాస్.. య క్రీడ అని ఆయన అన్నారు .విద్యార్థులు, యువత చెస్ వంటి మేధో క్రీడలను అలవాటు చేసుకుంటే ఆలోచనా శక్తి, ఏకాగ్రత, నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయని తెలిపారు. ప్రతి ఎత్తు ఒక వ్యూహం, ప్రతి కదలిక ఒక నిర్ణయం అనే విధంగా చెస్ ఆట జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షలు, కెరీర్ అవకాశాల్లో విజయానికి క్రమశిక్షణతో పాటు వ్యూహాత్మక ఆలోచన అవసరమని, ఆ లక్షణాలను చెస్ ఆట ద్వారా అభివృద్ధి చేసుకోవచ్చని ఆయన అన్నారు.
ఇలాంటి టోర్నమెంట్లు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు దారి చూపుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిర్వాహకులను ఆయన అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి పోటీలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం అనంతరం విజేతలకు ముఖ్యఅతిథి చేతుల మీదుగా మెమొంటోలు, సర్టిఫికెట్స్ అందజేసి అభినందించారు.
