మొగ్ధంపూర్–జక్లేర్ బస్సు పునఃప్రారంభం

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఆర్టీసీ డిపో పరిధిలోని మొగ్ధంపూర్–జక్లేర్ బస్సు సేవలు పునఃప్రారంభం కావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బస్సు ఊట్కూర్ మండలంలోని మొగ్ధంపూర్ నుంచి మక్తల్ మండల పరిధిలోని జక్లేర్ వరకు నడుస్తోంది.

గత నెల రోజులుగా ఈ బస్సు రాకపోకలు నిలిచిపోవడంతో మొగ్ధంపూర్ సర్పంచ్ తిరుమలేష్, సామాజిక కార్యకర్త హెచ్. నర్సింహాతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ఆర్టీసీ డిపో మేనేజర్ లావణ్యను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా డిపో మేనేజర్ లావణ్య మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నడిపే బస్సు కావడంతో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత సేవలు ప్రారంభిస్తామని తొలుత తెలిపారు. అయితే ఈ బస్సు ఎన్నో సంవత్సరాలుగా సాధారణ ప్రయాణికుల అవసరాలకు కూడా ఉపయోగపడుతోందని ప్రజాప్రతినిధులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో మార్చి, ఏప్రిల్ నెలల కలెక్షన్ల వివరాలను పరిశీలించిన అధికారులు ప్రయాణికులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి బస్సు సేవలను పునఃప్రారంభించారు. బస్సు సేవలను తిరిగి ప్రారంభించిన ఆర్టీసీ అధికారులు, డిపో మేనేజర్ లావణ్యకు ప్రజాప్రతినిధులు, ప్రయాణికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply