కల్యాణం.. కమనీయం
వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి పరిణయం
శుద్ధ షష్ఠి సందర్భంగా ఘనంగా నిర్వహిణ
వల్లీ-దేవసేన సమేతంగా స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం..
వివాహ ప్రాప్తి, నాగదోష నివారణకు విశేష ఫలితాలన్న భక్తుల విశ్వాసం..
వేదమంత్రోచ్ఛారణల మధ్య భక్తిశ్రద్ధలతో సాగిన ఉత్సవం…
( ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి) : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుద్ధ షష్ఠి తిథిని పురస్కరించుకుని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా శుక్రవారం నిర్వహించారు. కొండపైన మహామండపం ఏడో అంతస్తులోని కళావేదిక భక్తి పారవశ్యంతో మార్మోగగా, ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి దివ్య కళ్యాణాన్ని నిర్వహించారు.
ప్రతి నెలా శుద్ధ షష్ఠి నాడు నిర్వహించే ఈ ఆధ్యాత్మిక ఉత్సవం ఇంద్రకీలాద్రిపై విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ మహోత్సవం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. ఈ సందర్భంగా దేవస్థాన చైర్మన్ బోర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణానికి హిందూ సంప్రదాయంలో విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. వివాహ ఆటంకాలు ఎదుర్కొంటున్న వారికి శీఘ్ర వివాహ ప్రాప్తి కలుగుతుందని, సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు సంతాన భాగ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే నాగదోషాలు, కాలసర్ప దోషాల నుండి విముక్తి లభించి, మానసిక ధైర్యం, జ్ఞాన వికాసం, కార్యసిద్ధి కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.స్వామి వారి కళ్యాణంలో పాల్గొంటే భక్తుల జీవితాల్లోని ఆటంకాలు తొలగి సర్వ శుభాలు కలుగుతాయని చైర్మన్ బోర్రా రాధాకృష్ణ పేర్కొన్నారు. భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన ఈ కళ్యాణోత్సవం ఇంద్రకీలాద్రిపై మరోసారి భక్తి వైభవాన్ని చాటిచెప్పింది.
