లింగాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

లింగాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

  • ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని లింగాల మండల కేంద్రంలో పలు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. మొక్కజొన్న, వరి కొనుగోళ్లకు రైతులకు అందుతున్న సేవలు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, గ్రామ స్థాయిలో కొనసాగుతున్న జనగణన కార్యక్రమంపై ప్రత్యక్షంగా పరిశీలించి, వివరాలను సేకరించి, సమీక్ష నిర్వహించి సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

ముందుగా లింగాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ వరి, మొక్కజొన్న ధాన్యాల కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే విధానం, తూకం ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా తక్షణమే వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులు గంటల తరబడి వేచి ఉండకుండా సరైన ప్రణాళికతో కొనుగోళ్లు నిర్వహించాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని, ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేసే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ధాన్యం తరలింపు ప్రక్రియకు అవసరమైన లారీలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని, రైతులు ధాన్యం విక్రయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తార్పులు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం లింగాల గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఇండ్లు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను సందర్శించిన కలెక్టర్ పనుల పురోగతిని పరిశీలించారు.

లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సహాయం, నిర్మాణ సామగ్రి లభ్యత, పనుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు. ఇండ్ల నిర్మాణాలను నాణ్యత ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. లబ్ధిదారులకు సామాగ్రి, ఇసుక, ఇతర అవసరమైన నిర్మాణ సామగ్రి సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, పనులు మధ్యలో నిలిచిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

ప్రభుత్వం పేదలకు గౌరవప్రదమైన నివాస వసతి కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తోందని, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చివరి దశలో ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని, గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను అధికారులను గుర్తించి రెండోవ విడతలో ప్రభుత్వం అందజేసే ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.