Sensex | ఐటీ, గ్లోబల్ సంకేతాలతో మార్కెట్‌కు ఊపు

Sensex | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, అమెరికా మార్కెట్ల పుంజుకోవడం, ఐటీ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడం మార్కెట్‌కు ఊతమిచ్చాయి. ఉదయం ప్రారంభ సమయానికి నిఫ్టీ 78 పాయింట్లు లాభపడి 23,736 స్థాయికి చేరుకోగా.. సెన్సెక్స్ 169 పాయింట్లు పెరిగి 75,484 వద్ద ట్రేడవుతోంది.

అమెరికా మార్కెట్లు గత సెషన్‌లో బలంగా ముగియడం భారత మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపింది. యూఎస్ ఎస్ అండ్ పీ సూచీ 1.08 శాతం లాభపడగా.. నాస్‌డాక్ 1.54 శాతం పుంజుకుంది. టెక్నాలజీ రంగంలో కొనుగోళ్లు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఐటీ షేర్లకు మద్దతు లభిస్తోంది.

మరోవైపు అమెరికా డాలర్ ఇండెక్స్ 99.19 వద్ద కొనసాగుతుండగా.. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డు 4.58 శాతానికి చేరింది. అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 105.7 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ముడి చమురు ధరలు అధికంగా ఉన్నప్పటికీ, మార్కెట్లలో ప్రస్తుతం స్థిరత్వం కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లో ఐటీ, బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడవుతుండటంతో సూచీలు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానాలపై ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.