తడిసిన ధాన్యంను పరిశీలించిన మంత్రి జూపల్లి

తడిసిన ధాన్యంను పరిశీలించిన మంత్రి జూపల్లి

  • గొర్రెల కాపరిని పరామర్శించిన మంత్రి జూపల్లి
  • రూ.50 వేల తక్షణ సాయం అందించిన మంత్రి
  • రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షణ

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎన్మన బెట్ల గ్రామ శివారులో శనివారం పిడుగుపాటుకు 30 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు వెంటనే స్పందించి, బాధిత గొర్రెల కాపరిని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఆయనను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున పూర్తి అండగా ఉంటామని హామీ ఇస్తూ, తక్షణ సహాయం కింద రూ.50 వేల నగదును అందజేశారు.
తడిసిన ధాన్యం పరిశీలన..

అనంతరం మంత్రి జూపల్లి కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాశులను ఆయన నిశితంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఉన్న రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల వల్ల ధాన్యం తడిసినప్పటికీ రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, జిల్లా అధికారుల పర్యవేక్షణలో తడిసిన ధాన్యాన్ని సైతం గోదాములకు తరలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సీఎం నిరంతరం పర్యవేక్షణ..

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్కజొన్న దిగుబడి ఊహించిన దానికంటే భారీగా పెరగడంతో గోదాములు సరిపోవడం లేదని చెప్పారు. ఈ సమస్యను అధిగమించడానికి కాటన్ గోదాములు, ప్రైవేట్ గోదాములతో పాటు అవసరమైన చోట ఫంక్షన్ హాళ్లను సైతం వినియోగించుకుని నిల్వ చేస్తున్నామని వివరించారు. ధాన్యం రవాణాకు లారీల కొరత లేకుండా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకుంటోందన్నారు.
ఇబ్బందులున్నా అధిక ధరకే కొనుగోలు..
కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో కొనుగోలు చేయడం లేదని మంత్రి జూపల్లి విమర్శించారు. దీనివల్ల రైతులు అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి వస్తోందన్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో మొక్కజొన్నకు చాలా తక్కువ ధర ఉన్నప్పటికీ, రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తోందని స్పష్టం చేశారు. హమాలీల కొరత, ఆర్థిక ఇబ్బందులు, గోదాముల కొరత వంటి సమస్యలు వేధిస్తున్నప్పటికీ.. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply