రైతు పక్షపాతి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
రైతు పక్షపాతి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
- చొరవతో జొన్న రైతులకు ఊరట
డోంగ్లి, ఆంధ్రప్రభ:
జుక్కల్ నియోజకవర్గంలో జొన్న సాగుచేసిన రైతుల కష్టాలు తీర్చేందుకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చొరవ తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాలో జొన్న కొనుగోలుకు ఇప్పటివరకు అనుమతులు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోయే పరిస్థితి ఉండేది. ఆయన కృషి, పట్టుదలతో జొన్న కొనుగోలు కేంద్రాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.
జుక్కల్ నియోజకవర్గం అత్యధికంగా జొన్న సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలతో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు మార్కెటింగ్ శాఖ మంత్రిని, అధికారులను వరుసగా కలిశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతుల గోడు వినిపించారు. పంట చేతికొచ్చినా కొనేవారు లేక రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పట్టుదలతో ప్రభుత్వం దిగొచ్చి జుక్కల్ నియోజకవర్గంలో జొన్న కొనుగోలు కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులతో బుధవారం జుక్కల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి, మొదటి బస్తాకు తూకం వేసి కేంద్రాన్ని ప్రారంభించారు.
జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంతో క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర 3,699 లభిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దళారుల మోసాలకు చెక్ పడుతుందని, గిట్టుబాటు ధరతో పాటు తూకంలో మోసం లేకుండా నేరుగా డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని స్థానిక రైతులు జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు.
