బిల్లుల కోసం కాంట్రాక్టర్ గ్రామ పంచాయతీ తాళం

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయానికి మంగళవారం కాంట్రాక్టర్ తాళం వేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు పూర్తి చేసి నెలలు గడిచినా ఇప్పటివరకు బిల్లులు విడుదల చేయలేదని ఆరోపిస్తూ కాంట్రాక్టర్ నిరసనకు దిగాడు. బకాయిల చెల్లింపుల విషయంలో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో చివరకు గ్రామ పంచాయతీ కార్యాలయానికే తాళం వేసినట్లు తెలిపాడు.
కార్యాలయానికి తాళం వేయడంతో జనన, మరణ ధ్రువపత్రాల జారీ, పన్నుల చెల్లింపులు, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు పలు పౌర సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన గ్రామస్తులు వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్రామపంచాయతీ సిబ్బంది కూడా కార్యాలయం బయటే నిలిచిపోయారు.
గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని కాంట్రాక్టర్ సమస్యను పరిష్కరించి గ్రామపంచాయతీ కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
