ఘనంగా స్వచ్ఛ పదం కార్యక్రమం..
ఘనంగా స్వచ్ఛ పదం కార్యక్రమం..
గుడివాడ – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు గ్రామపంచాయతీ పరిధిలో స్వచ్ఛతే సేవ అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “స్వచ్ఛ పదం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి.వై.విష్ణు ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాస రావు, బిళ్ళపాడు పంచాయతీ కార్యదర్శి వి.హరికృష్ణ , పంచాయతీ సిబ్బంది, వాలంటీర్లు మరియు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సంధర్భంగా బిళ్ళపాడు గ్రామం నుండి చిన్నయెరికపాడు వరకు ఉన్న ప్రధాన రహదారి ఇరువైపులా శుభ్రత కార్యక్రమం చేపట్టారు. రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మురుగు చెత్తను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. అలాగే రహదారి వెంట పెరిగిన పొదలు, కలుపు మొక్కలను తొలగించి ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించేలా చర్యలు చేపట్టారు.
అధికారులు మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అనీ, పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యకరమైన సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. గ్రామ ప్రజలు తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.
గ్రామస్తులు కూడా స్వచ్ఛతా కార్యక్రమానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొనడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తూ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.
