రైతు బజార్ కు అదనంగా స్థలము కేటాయించండి

రైతు బజార్ కు అదనంగా స్థలము కేటాయించండి

జిల్లా కలెక్టర్ కు మిర్చి యార్డ్ చైర్మన్ వినతి

గుంటూరు, ఆంధ్రప్రభ: గుంటూరు నగరంలోని కృష్ణానగర్ ప్రాంతంలో ప్రతిపాదిత మోడల్ రైతు బజార్ నిర్మాణానికి ప్రస్తుతం కేటాయించిన 1322 చదరపు గజాల స్థలం సరిపోకపోవడంతో, రైతులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అదనపు స్థలం కేటాయించాలని కోరుతూ గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ కుర్రా అప్పారావు గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యాడ్ చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ, కృష్ణానగర్‌లో నిర్మించనున్న మోడల్ రైతు బజార్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో విస్తృత స్థలం అవసరమని వివరించారు. భవిష్యత్తులో మరింత మంది రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు అనుకూల వాతావరణం కల్పించడంతో పాటు, పార్కింగ్, నిల్వ సదుపాయాలు, తాగునీరు, శుభ్రత మరియు ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అదనపు స్థలం అత్యవసరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిపాదనను సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతుల సంక్షేమం, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడం, పట్టణాభివృద్ధికి దోహదపడే విధంగా కృష్ణానగర్ మోడల్ రైతు బజార్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు