మెడికల్ షాపుల బంద్కు సహకరించాలి

మెడికల్ షాపుల బంద్కు సహకరించాలి
టేకుమట్ల, ఆంధ్రప్రభ:
మే 20న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న మెడికల్ షాపుల బంద్కు ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని టేకుమట్ల మండల కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం స్థానిక తహసీల్దార్ స్వరూప రాణి, ఎస్సై అమూల్యను విడివిడిగా కలిసి బంద్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ వినతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. ఆన్లైన్ ద్వారా మందుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు భారీ డిస్కౌంట్ల పేరుతో చిన్న మెడికల్ షాపుల వ్యాపారాలను దెబ్బతీయకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ మందుల విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ.. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఈ దేశవ్యాప్త బందును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీఎస్ఆర్ నిబంధనలను సైతం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరారు.
మే 20న టేకుమట్ల మండలంలోని అన్ని మెడికల్ షాపులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తాయని స్పష్టం చేశారు. బంద్ కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మందులు అవసరమైతే ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా 9951024789, 9603295502 ఫోన్ నంబర్లను ఏర్పాటు చేశామని, వీటిని సంప్రదించి మందులు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వడ్నాల మహేందర్, గండు నరేష్, శ్రీనివాస్, వీరమల్లు, రమణ కుమార్, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.
