మోడీ పిలుపుతో షాక్…

మోడీ పిలుపుతో షాక్…
నందికొట్కూరులో బంగారు దుకాణాలు బంద్
ఏడాది బంగారం కొనొద్దన్న ప్రధాని..
రోడ్డున పడ్డాం స్వర్ణకారుల ఆవేదన
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : బంగారు కొనుగోలుకు ఒక సంవత్సరం వేచి చూడండి” అంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పిలుపు, బంగారంపై అధిక పన్నులు విధించడాన్ని నిరసిస్తూ మంగళవారం నందికొట్కూరు పట్టణంలో బంగారు దుకాణాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. రాష్ట్రవ్యాప్త స్వర్ణకార సంఘాల బంద్ పిలుపులో భాగంగా ఈ నిరసన చేపట్టారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం అనే విధంగా మా జీవితాలు ఉన్నాయని షరాఫ్ బజార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూడవెల్లి శ్రీరాములు మాట్లాడుతూ,స్వర్ణకార వృత్తిని నమ్ముకొని దేశవ్యాప్తంగా లక్షల మంది కార్మికులు బతుకుతున్నారు. ప్రధాని నిర్ణయంతో మేమంతా రోడ్డున పడతాం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికే బంగారు వ్యాపారంలోకి కార్పొరేట్ రంగం ప్రవేశించి విపరీతమైన పోటీ నెలకొంది. దీంతో చిరు వ్యాపారులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పైగా బంగారం ధరలు విపరీతంగా పెరిగి వ్యాపారాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో ‘బంగారం కొనొద్దు’ అని ప్రధాని పిలుపునివ్వడంతో మా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టయింది” అని వాపోయారు.
పెరుగుతున్న బంగారు ధరలకు అడ్డుకట్ట వేసి, స్వర్ణకారుల సంక్షేమం కోసం ప్రధాని మోడీ చర్యలు తీసుకోవాలని, బంగారు కొనుగోలుపై స్వర్ణకారులకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బంగారు వ్యాపారులు సురేంద్ర, ప్రసాద్, సుధాకరాచారి, సుబ్రహ్మణ్యం, నరసింహ చారి, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
