ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేయాలి

-జీఎం రాజేశ్వర్ రెడ్డి

భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ:
సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమిష్టి కృషి, అంకితభావం ఎంతో అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ (జీఎం) ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-5 ఇంక్లైన్ భూగర్భ గనిలో మంగళవారం మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సింగరేణి దేశ పారిశ్రామికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రతి ఉద్యోగి పూర్తి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుపై అధికారులు, కార్మికులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సంస్థను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్మికుల ఆరోగ్యం, పిల్లల విద్య, గనుల్లో భద్రత అంశాల్లో పలు రకాల సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నారని, భూగర్భ గనుల్లో సైతం పనిచేసేందుకు మరింతగా ముందుకు రావాలని సూచించారు.

ఈ సమావేశంలో ఎస్‌వో టు జీఎం ఎస్. కవీంద్ర, ఏజీఎం జ్యోతి, ఏరియా ఇంజనీర్ రాజారావు పాల్గొన్నారు. వీరితో పాటు డీజీఎంలు రాజేశ్వర్, కృష్ణప్రసాద్, పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, మేనేజర్ మాచర్ల రమేష్, సంక్షేమ అధికారి సందీప్, వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply