పార్టీ బలోపేతమే లక్ష్యం.. చిన్నపాటి విభేదాలు త్వరలోనే సర్దుకుంటాయి

పార్టీ బలోపేతమే లక్ష్యం.. చిన్నపాటి విభేదాలు త్వరలోనే సర్దుకుంటాయి

-భీమ్‌గల్ కాంగ్రెస్ నూతన మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేయడమే ఏకైక లక్ష్యంగా తాను పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ నూతన మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ స్పష్టం చేశారు. సోమవారం భీమ్‌గల్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతన మండల, పట్టణ అధ్యక్షుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు వందలాది మంది కార్యకర్తలు తరలివచ్చి నూతన కార్యవర్గానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎంపికైన అధ్యక్షులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న రోజుల్లో పార్టీ విజయమే ధ్యేయంగా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

తన నియామకంపై పార్టీలోని కొందరు నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేయడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. “ఒక పెద్ద కుటుంబంలో సమస్యలు రావడం సహజం.. మన ఇంట్లో సమస్య వస్తే అందరం కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎలా పరిష్కరించుకుంటామో, పార్టీలోని అంతర్గత విభేదాలను కూడా అలాగే త్వరలోనే పరిష్కరించుకుంటాం” అని ధీమా వ్యక్తం చేశారు. వ్యతిరేకించిన వారు కూడా మన పార్టీ కుటుంబ సభ్యులేనని, వారిని కూడా కలుపుకుని భవిష్యత్తులో పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా అడుగులు వేస్తానని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

నేతల చిత్రపటాలకు పాలాభిషేకం – బైక్ ర్యాలీ
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్, జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నాగేష్ రెడ్డిల చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం చేశారు. అనంతరం పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ సన్మాన , పాలాభిషేక కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూతన టౌన్ ప్రెసిడెంట్ పర్శ అనంత్ రావు, మాజీ సొసైటీ చైర్మన్ కోనేరు బాలగంగాధర్, కౌన్సిలర్లు తోట సతీష్, సందీప్, సంగ్యానాయక్, అంజుమ్, అలాగే ముఖ్య నాయకులు భోజగౌడ్, చెప్పాల గణేష్, రాడే మురళి, మంద గోవర్ధన్, లక్ష్మి, జీవన్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.