నాటకాలతో ప్రజలను మభ్యపెట్టలేరు

నాటకాలతో ప్రజలను మభ్యపెట్టలేరు

ఇంధన ధరలపై వైసీపీ నిరసనలు విడ్డూరం..
కేంద్రంతో దోస్తీ చేస్తూ రాష్ట్రంలో డ్రామాలా?
వెలంపల్లి రాజకీయాలపై ప్రభుత్వ విచారణ తప్పదన్న

కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం ఎస్ బేగ్..

విజయవాడ, ఆంధ్రప్రభ : కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంతో లోపాయికారీ సంబంధాలు కొనసాగిస్తూ, రాష్ట్రంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై రోడ్డెక్కడం ప్రజలను మోసం చేయడమేనని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఎం.ఎస్. బేగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. వెలంపల్లి శ్రీనివాస్ చేస్తున్న రాజకీయ నిరసనలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అర్థం పర్థం లేని ఆరోపణలు, నిరసనల పేరుతో నాటకాలు ఆడుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని వ్యాఖ్యానించారు. నిజంగా వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే, ఆ పార్టీ ఎంపీలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలపాలని సవాల్ విసిరారు.

కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీతో చాపకింద నీరులా స్నేహం కొనసాగిస్తూ, మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ధరల పెరుగుదలను కూటమి ప్రభుత్వంపై నెట్టడం విచిత్రంగా ఉందన్నారు. 2021 నవంబర్ 9న అప్పటి మంత్రి పేర్ని నాని కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో భారీగా వసూళ్లు చేస్తోందని, ఇంధన ధరలు తగ్గించాలని డిమాండ్ చేసిన విషయాన్ని బేగ్ గుర్తు చేశారు. అదే అంశం ఇప్పుడు ఎందుకు గుర్తుకు రావడం లేదని వైసీపీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. విగ్రహాల చోరీల నుంచి దేవాదాయ భూముల అన్యాక్రాంతం వరకు గతంలో చోటుచేసుకున్న అంశాలపై వెలంపల్లి పాత్రపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశముందని బేగ్ పేర్కొన్నారు.

ఇప్పటికే ప్రభుత్వానికి కొన్ని కీలక సమాచారం అందిందని వ్యాఖ్యానిస్తూ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశారు. ఐదేళ్లపాటు మంత్రిగా పనిచేసిన సమయంలో దేవాదాయ శాఖను గానీ, సొంత నియోజకవర్గ అభివృద్ధిని గానీ పట్టించుకోలేదని ఆరోపించిన బేగ్, ఇప్పుడు రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకే అప్పుడప్పుడు రోడ్డెక్కుతున్నారని విమర్శించారు. ఇకనైనా హుందా రాజకీయాలు చేయాలని వెలంపల్లికి సూచించారు.

Leave a Reply