మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్

మైనర్ బాలిక పట్ల అనుచిత ప్రవర్తన.. వ్యక్తి అరెస్ట్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో 13 సంవత్సరాల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చిలకలపూడి ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబీ ఆదివారం తెలిపారు. 13వ తేదీ ఉదయం మచిలీపట్నంకు చెందిన 13 సంవత్సరాల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పరిస్థితిని ఆసరాగా తీసుకొని బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడియత్నానికి పాల్పడడం జరిగింది.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు వెంటనే చిలకలపూడి పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
పై అధికారుల ఆదేశాల మేరకు చిలకలపూడి పోలీసులు వేగంగా విచారణ చేపట్టి, సాంకేతిక ఆధారాలు , స్థానిక సమాచారం ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా నిందితుడు తన తప్పును ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరు పరచగా, కోర్టు ఆదేశాల మేరకు జుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
మైనర్ బాలికలు, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, వేధింపులు లేదా లైంగిక నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కృష్ణాజిల్లా పోలీసులు హెచ్చరించారు. బాలల భద్రతకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా 112 కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
