మూడేళ్ల పెండింగ్‌కు ముగింపు పలకాలి..

మూడేళ్ల పెండింగ్‌కు ముగింపు పలకాలి..

ఇంకెన్నాళ్లు పీఆర్‌సీ, ఐఆర్ కోసం ఎదురుచూడాలి
వెంట‌నే ఉద్యోగుల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌ను నెర‌వేర్చాలి
ఏపీ ఎన్‌జీజీవో సంఘ రాష్ట్ర కార్యవర్గ తీర్మానం
ఎన్‌జీజీవో నాయ‌కులు, ఉద్యోగులకు జోన్ల వారీగా శిక్షణ తరగతులు
ఉద్యోగుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో రాజీప్ర‌స‌క్తే లేదు
పెండింగ్ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం కట్టుబాటు
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర సంఘ అధ్య‌క్షుడు ఎ.విద్యాసాగ‌ర్‌

విజయవాడ, బఆంధ్రప్రభ : మూడేళ్ల ఎదురుచూపుల‌కు ముగింపు ప‌లుకుతూ రాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే పీఆర్‌సీ ఛైర్మ‌న్‌ను నియ‌మించి.. ఉద్యోగుల ఆశ‌లు నెర‌వేర్చేలా మ‌ధ్యంత‌ర భృతి (ఐఆర్‌) ప్ర‌క‌టించాల‌ని ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఎ పి ఎన్జీవో హోంలో రాష్ట్ర సంఘ అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అధ్యక్షతన ఆదివారం రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అన్ని జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మహిళా విభాగం, వివిధ విభాగాల సంఘ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో దాదాపు 12 గంటలపాటు ఉద్యోగుల వివిధ సమస్యలపై చర్చించారు.

సమావేశం లో విద్యాసాగర్ మాట్లాడుతు వేతన సవరణ కమిషన్ నియామకం చాలా ఆలస్యమైందని, 2023 నుంచి వేతన సవరణ కోసం ఎదురుచూస్తున్నామని, వేతన సవరణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో స్పష్టత లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో 2023లోనే వేతన సవరణ కమిషనర్‌ను నియమించగా, కేంద్ర ప్రభుత్వం కూడా 2026 వేతన సవరణ ప్రక్రియను ముందుగానే ప్రారంభించిందని పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికీ పీఆర్‌సీ కమిషనర్ నియామకం జరగకపోవడం ఉద్యోగుల పట్ల సూచన ఏమైనా విషయంగా భావిస్తూ రాష్ట్ర ఈ అంశంపై రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు

మ‌రోవైపు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు, పోలీసు కేసుల ఎత్తివేత తదితర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని పేర్కొంటూ, దాదాపు రూ.21 వేల కోట్ల బకాయిల విడుదలపై రాష్ట్ర కార్యవర్గం హర్షం నీయమన్నారు. పెండింగ్‌లో ఉన్న మెమో-57 ప్రకారం 2004కు ముందు నోటిఫై అయిన అభ్యర్థులను ఓపీఎస్‌లోకి తీసుకురావడం, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కల్పించడం, పెన్షనర్లకు అదనపు కంటిన్యూ పెన్షన్ అమలు వంటి కీలక అంశాలపై సమావేశంలో సమగ్ర చర్చ జరిగిందన్నారు. ఈ సమస్యలన్నింటిపైనా ప్రభుత్వం సానుకూల దృక్పథంతో స్పందించి త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని సభ్యులు వ్యక్తం చేశారు.

ఐవీఆర్ఎస్ కాల్స్‌తో చర్యలు స‌మంజ‌సం కాదు..

ఐవీఆర్ఎస్ కాల్స్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులపై అధిక ఒత్తిడి తీసుకురావడం, వాటి ఆధారంగా సస్పెన్షన్ వంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం సరికాదని రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు.ఐవిఆర్ఎస్ వ్యవస్థను కేవలం ఒక మోడల్‌గా పరిగణించి, దానిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు తగిన విధానాలు అవలంబించాలే గాని, ఉద్యోగులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవడం తగదని పేర్కొంది. అలాగే ఉద్యోగులకు సంబంధించిన హెల్త్ కార్డు వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయని, కార్డు ఉన్నప్పటికీ సరైన వైద్య సేవలు అందడం లేదని పలువురు సభ్యులు రాష్ట్ర కార్యవర్గ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కార్యవర్గం కోరింది.

పీఆర్‌సీపై రాజీ లేదు.. ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యం…

ప్రభుత్వంతో నిరంతర చర్చలు, ప్రయత్నాల ద్వారా ఉద్యోగులకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ముఖ్యంగా పీఆర్‌సీ కమిటీ నియామకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాల పరిష్కారానికి రాష్ట్ర నాయకత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. అలాగే ఉద్యోగులు, సంఘ నాయకులకు సంబంధించి అన్ని జోన్ల వారీగా శిక్షణ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్ర మహిళా విభాగం ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సదస్సు నిర్వహించాలని సూచించగా, రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు వెల్లడించారు.

అలాగే ఉద్యోగులకు సరెండర్లు కూడా ప్రభుత్వం దృష్టికి సారించాలని సమావేశం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ మాట్లాడుతూ పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచే అంశం, మెమో-57 అమలు ద్వారా సుమారు 11 వేల మందిని ఓపీఎస్‌లోకి తీసుకురావడం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని పేర్కొన్నారు. అయితే వీటిపై త్వరితగతిన ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాలను ఇప్పటికే ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అనుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.

కొత్తగా ఏర్పడిన జిల్లాలకు 16 శాతం హెచ్ఆర్ఏ ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలన్న అంశాన్ని కొన్ని జిల్లాల ప్రతినిధులు కార్యవర్గ దృష్టికి తీసుకువచ్చారని, ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని రాష్ట్ర కమిటీ కార్యవర్గానికి తెలియజేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గత ఐదు నెలలుగా రాష్ట్రంలో ప్రమోషన్ల ప్రక్రియ వేగవంతమైందని, దాని ఫలితంగా అనేక మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించాయని ఇందుకు ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర కార్యవర్గం ధన్యవాదాలు చేస్తున్నామని తెలిపారు.

సమావేశంలో రాష్ట్ర సహాధ్యక్షడు వి. దస్తగిరి రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.జగదీశ్వర రావు.కోశాధికారి భారతి ప్రసాద్ కార్యవర్గ సభ్యులు ఎల్.బొంజయ్య, ఆర్.ఎస్. హరనాథ్, జాని పాషా షేక్ మహమ్మద్, పి. కిరణ్ కుమార్, షేక్ నాగూర్ షరీఫ్, వై. ప్రసాద్, ఎస్. రాజశేఖర్, ఆర్. రవి శంకర్, ఎం. సత్యనారాయణ రాజు, బి. వెంకటేష్ బాబు, ఆర్. వేణు గోపాల్, టి. యేసుబాబు బి. జానకి (పబ్లిసిటీ ఎల్. రజనీష్ బాబు, ఎస్.బి.వి. రామ్ ప్రసాద్, ఎ. రంజిత్ కుమార్ నాయుడు, పి. శివ ప్రసాద్, వి. సుబ్బా రెడ్డి ఎం. సరస్వతి తదితర పాల్గొన్నారు.

Leave a Reply