ధాన్యం కొనుగోలు నిలకడగా లేక రైతుల ఆవేదన

ధాన్యం కొనుగోలు నిలకడగా లేక రైతుల ఆవేదన
గన్నీ బ్యాగుల కొరతతో మిల్లర్లకు నేరుగా ధాన్యం తరలిస్తున్న రైతులు
కలగర రైతు భరోసా కేంద్రంలో అవ్యవస్థలపై ఆగ్రహం
విస్సన్నపేట, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేట మండలం కలగర గ్రామపంచాయతీ పరిధిలో దాల్వా వరి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో, చేసేదిలేక రైతులే స్వయంగా ట్రాక్టర్ల ద్వారా రైస్ మిల్లర్లకు లూజ్ ధాన్యాన్ని తరలిస్తున్నారు.
కలగర గ్రామం నుంచి పుట్రెల గ్రామ పరిధిలోని రెండు రైస్ మిల్లులకు రైతులు ట్రాక్టర్ ట్రక్కుల ద్వారా ధాన్యాన్ని తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం 100 కేజీల వరి ధాన్యానికి రూ.1,950 చొప్పున అమ్మకాలు జరుపుతూ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రైతుల ప్రకారం, ట్రాక్టర్ ఒక్క ట్రిప్పుకు రూ.2,000 కిరాయి చెల్లించాల్సి వస్తోంది. అదనంగా ధాన్యం లోడింగ్ కోసం కూలీలకు సుమారు రూ.1,000 వరకు ఇవ్వాల్సి వస్తోంది. ఒక్క ట్రిప్పుకు సుమారు రూ.3,000 ఖర్చవుతున్నప్పటికీ, ధాన్యం అమ్మిన తర్వాత రైతులకు మిగిలేది చాలా తక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 8వ తేదీన ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ఆందోళనకు దిగినట్లు తెలిపారు. అనంతరం అధికారులు గ్రామానికి చేరుకుని మరుసటి రోజు నుంచి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించినట్లు చెప్పారు.
అయితే గన్నీ బ్యాగుల కొరత కారణంగా మిల్లర్లు ధాన్యం దిగుమతికి ఆసక్తి చూపడం లేదని అధికారులు రైతులకు వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్యాగులు సరఫరా అవుతున్నప్పటికీ, వచ్చిన వాటిలో సగానికి పైగా డ్యామేజ్ బ్యాగులే ఉండటంతో పూర్తిస్థాయిలో వినియోగించలేని పరిస్థితి నెలకొంది.
కొంతమంది రైతులకు గన్నీ బ్యాగులు ఇచ్చి ధాన్యం నింపించిన తర్వాత కూడా కాటా వేసి లారీల్లో లోడింగ్ చేయకపోవడం వల్ల మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ధాన్యం తడిసిపోతుందనే భయంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
