Petition | బండి భగీరథ్ కేసు విచారణ సందర్భంగా..
Petition | బండి భగీరథ్ కేసు విచారణ సందర్భంగా..
Petition |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సోషల్‌మీడియాలో జడ్జిని లక్ష్యంగా చేసుకుని అనుచిత పోస్టులు వెలువడిన ఘటన చర్చనీయాంశంగా మారింది. విచారణ జరుగుతున్న సమయంలోనే కొన్ని సోషల్‌మీడియా వేదికల్లో అసత్య ప్రచారం, అభ్యంతరకర వ్యాఖ్యలు వైరల్‌గా మారినట్లు సమాచారం.
విచారణ సందర్భంగా ఈ పోస్టుల అంశాన్ని జడ్జి స్వయంగా ప్రస్తావించినట్లు తెలిసింది. కేసుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియపై ప్రభావం చూపేలా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోందని ఆందోళన వ్యక్తమైనట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి భర్తకు బార్ కౌన్సిల్ ఛైర్మన్ పదవి ఇస్తారంటూ సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రచారానికి సంబంధించిన పలు సోషల్‌మీడియా పోస్టులను కూడా ఫిర్యాదుకు ఆధారాలుగా సమర్పించినట్లు తెలిసింది.
హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు ఆధారంగా చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకోవడంతో కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు బదిలీ చేశారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో పోస్టులు చేసిన వ్యక్తులు ఎవరు, ప్రచారం వెనుక ఉద్దేశ్యం ఏమిటి అనే దిశగా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలపై అసత్య ప్రచారం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
CLICK HERE TO READ MORE : ధాన్యం కొనలేక ఆరోపణలు : కిషన్‌రెడ్డి
