కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ డీకే అరుణకు ఫోన్ చేశారు. అరుణ నివాసంలోకి అపరిచితుడు చొరబడిన ఘటనపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా డీకే అరుణకు పూర్తి రక్షణ కల్పించాలని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
కాగా, శనివారం అర్ధరాత్రి తర్వాత ఎంపీ డీకే అరుణ నివాసంలోకి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 56లో డీకే అరుణ నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో దుండగుడు చేతులకు గ్లౌజ్‌లు ధరించి డీకే అరుణ ఇంట్లోకి చొరబడ్డాడు.
దాదాపు గంటన్నరపాటు ఆమె ఇంట్లో తిరిగినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబందించిన వివరాలను డీకే అరుణ కారు డ్రైవర్ లక్ష్మణ్ వెల్లడించారు.
ఆగంతకుడు గంటన్నరపాటు కిచెన్‌లో ఉన్నాడని, ఎంపీ గది వరకు వెళ్లాడని డ్రైవర్ చెప్పారు. ఆ సమయంలో డీకే అరుణ ఇంట్లో లేరని. మీటింగ్ కోసం శనివారం మహబూబ్‌నగర్ వెళ్లారని డ్రైవర్ చెప్పారు.
అయితే, ఇంట్లో ఎలాంటి వస్తువులు పోలేదని తెలిపారు. ఒక్కడే వచ్చినట్లు సీసీ టీవీలో కనిపించిందన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ తెలిపారు.