పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ రాస్తారోకో ధర్నా
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ రాస్తారోకో ధర్నా
ధరలు తగ్గించే వరకు సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళనలు
సీపీఐ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి ఫయాజ్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను నిరంతరం పెంచుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోందని సీపీఐ నాగర్‌కర్నూల్ జిల్లా కార్యదర్శి ఎస్.ఎం.డి ఫయాజ్ తీవ్రంగా విమర్శించారు. సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిర్వహించిన నాగర్ కర్నూల్ జిల్లాలో రాష్ట్ర రాస్తారోకో మరియు నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రజల రక్తాన్ని పిండి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల కేవలం వాహనదారులకే కాదు, సామాన్య ప్రజల జీవితమంతా తీవ్ర ప్రభావానికి గురవుతోందన్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, పేద, మధ్యతరగతి ప్రజలు జీవనం సాగించడం కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు వ్యవసాయ ఖర్చులు పెరిగి పంటలు సాగు చేయడం భారంగా మారిందన్నారు. ఆటో కార్మికులు, చిన్న వ్యాపారులు, కూలీలు, ఉద్యోగులు అందరూ ఈ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా ఎక్సైజ్ సుంకాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటోందని ఫయాజ్ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్‌పై భారీ పన్నులు విధించి ప్రజల శ్రమను దోపిడీ చేస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యంగా మారిందన్నారు.
“ప్రజల బాధలు పట్టని మోడీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్ పాలన వైపు నెడుతోంది. ఒకవైపు నిరుద్యోగం, మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో ఉన్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రచార రాజకీయాల్లో మునిగిపోయింది” అని విమర్శించారు.
సీపీఐ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తుందని, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలపై విధిస్తున్న అధిక పన్నులను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడు హెచ్ ఆనంద్ జి, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మర్యాద వెంకటయ్య, ఏఐఎస్ఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి బండి లక్ష్మీపతి, ఎండి సయ్యద్ కాజా, ఈర్ల భూపేష్, వంకేశ్వరం శ్రీను, కొత్త రామస్వామి, ఎండి కాజా, రామచంద్రమ్మ, జి రామకృష్ణ, సత్యం, విజయ్,వెంకటస్వామి, శివ, చెన్నయ్య, సుధాకర్, కొత్తకోట కర్రన్న, బజ్జన్న, సీతయ్య, శివయ్య యాదమొని, మరియు తదితులు పాల్గొన్నారు.
