అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి

అత్యాచార కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి

సీఐ చిన్నమల్లయ్య హైకోర్టులో పిటిషన్

నరసరావుపేట, ఆంధ్రప్రభ : అత్యాచార ఆరోపణలతో తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్న సీఐ చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టు విచారణ జరిపింది. వాదనలు ముగియడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి జస్టిస్ మెడమల్లి బాలాజీ ప్రకటించారు. తీర్పును రిజర్వు చేశారు.

వీఆర్ లో ఉన్న సీఐ బి. చిన్నమల్యయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని నిందితుడు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం జరిగిన విచారణలో న్యాయవాది చల్లా అజయ్ కుమార్ వాదనలు వినిపించారు.

అత్యాచార ఆరోపణలు చేస్తున్న మహిళ పిటిషనర్ నుంచి అనేక సార్లు సొమ్ము తీసుకున్నారన్నారు. ఐదేళ్లుగా ఆమె తెలుసన్నారు. పిటిషనర్ కోసం ఆయన కుమారుడిని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారన్నారు. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ దర్యాప్తు ఏ దశలో ఉంది, పిటిషనర్ ను అరెస్ట్ చేయలేదని సహాయ పీపీ ప్రియాంకను ప్రశ్నించారు.

ఆమె బదులిస్తూ ‘పిటిషనర్ పరారీలో ఉన్నారు. పోలీసులు వెతుకుతున్నారు. నిందితుడి కుమారుడు బాధితురాలికి మెసేజ్లు పంపి ఎందుకు బెదిరించారు. ఫోరెన్సిక్ నివేదిక రావాల్సి ఉంది. నిందితుడికి పటుత్వ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. బెయిలు మంజూరు చేయ వద్దు’ అని కోరారు.