రూ.2 కోట్లతో ఆధునిక రైతు బజార్‌కు శంకుస్థాపన
రూ.2 కోట్లతో ఆధునిక రైతు బజార్‌కు శంకుస్థాపన
- కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్
గుంటూరు, ఆంధ్రప్రభ:
రైతులకు నేరుగా మార్కెట్ సదుపాయం కల్పిస్తూ, వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించే లక్ష్యంతో కృష్ణా నగర్లో ఆధునిక రైతు బజార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ రైతు బజార్ భవనానికి కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు బజార్లు ముఖ్యమంత్రి ఆలోచనల్లో భాగమైన ప్రజాప్రయోజన కార్యక్రమాలని పేర్కొన్నారు. రూ.4 కోట్ల విలువైన స్థలంలో రూ.2 కోట్లతో రెండు అంతస్తుల భవనం నిర్మాణం చేపడుతున్నామని, 9 నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రైతులకు, మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇస్తూ 60 రైతు స్టాళ్లు, 30 డ్వాక్రా స్టాళ్లు, 10 దుకాణాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రైతు బజార్ నిర్మాణం నాణ్యతతో ఉండాలని, పార్కింగ్, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు సమగ్రంగా కల్పించాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహణ ఉండాలని స్పష్టం చేశారు.
ఎంఎల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాంతంలో రైతు బజార్ ఏర్పాటు కావడం సంతోషకరమన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రైతు బజార్లో సుమారు 100 స్టాళ్లు ఏర్పాటు చేసి, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ చేపడతామని చెప్పారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్రా అప్పారావు మాట్లాడుతూ.. కూరగాయలతో పాటు పండ్లు, పూల విక్రయాలకు కూడా అవకాశం కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ సంచాలకులు శ్రీనివాసరావు, సహాయ సంచాలకులు సత్యనారాయణ చౌదరి, గాదె వెంకటేశ్వరరావు, పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.

