రవి గౌడ్ చికిత్సకు చేయూత కోరుతూ వినతి

కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన నిరుపేద గీత కార్మికుడు ఎనగంటి రవి గౌడ్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. తాటి చెట్లు గీస్తూ కులవృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న రవి గౌడ్‌కు భార్యతో పాటు ఇద్దరు చిన్నారి కుమార్తెలు ఉన్నారు.

వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురైన రవి గౌడ్‌ను కుటుంబ సభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆయన మెదడులో రక్తం గడ్డకట్టినట్లు, అలాగే ఒక కిడ్నీ, లివర్ దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు.

రోజువారీ గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న రవి గౌడ్‌కు సొంత ఇల్లు, ఆస్తిపాస్తులు లేవు. వైద్య ఖర్చులు భరించే స్థోమత కూడా లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న కల్లెడ గ్రామస్తులు స్పందించి ఇప్పటివరకు రూ.70 వేల వరకు సాయం అందించి వైద్య చికిత్సకు తోడ్పడ్డారు.

అయితే ప్రస్తుతం రవి గౌడ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. దీంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించి తమ ప్రాణాలను కాపాడాలని రవి గౌడ్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం అందించదలిచిన వారు దేశరాజుల మహేష్ చారి ఫోన్‌పే నంబర్ 85000 26085 కు నగదు పంపించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.