కోకో సిటీపై ఫోకస్.. ప్రీమియం చాక్లెట్ల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గుర్తింపు
కోకో సిటీపై ఫోకస్.. ప్రీమియం చాక్లెట్ల హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గుర్తింపు
- కోకో ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ బ్రాండింగ్‌పై ప్రభుత్వం దృష్టి
- మరో 16 కోకో ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక
- వెస్ట్-ఇన్ చాక్లెట్స్‌తో ప్రపంచ మార్కెట్‌లోకి ఏపీ అడుగులు
- రైతులకు విలువ ఆధారిత ఉత్పత్తులతో అధిక ఆదాయం
- కోకో సిటీ, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం కోకో ఉత్పత్తుల బ్రాండింగ్, మార్కెటింగ్, విలువ ఆధారిత విధానాలకు విస్తృత ప్రణాళికలు రూపొందించింది. దేశంలో కోకో ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచేందుకు ముందడుగు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 40 వేల హెక్టార్లలో కోకో సాగు జరుగుతుండగా, ఏటా 18-20 వేల మెట్రిక్ టన్నుల డ్రై కోకో బీన్స్ ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధానంగా ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా కోకో సాగు చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే కోకో బీన్స్‌ను ముడిసరుకుగానే విక్రయిస్తున్నారు. దీనివల్ల రైతులకు తగిన ఆదాయం లభించలేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ (ఏపీఎఫ్‌పీఎస్) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పీఎంఎఫ్‌ఎంఈ పథకం ద్వారా కోకో నాణ్యత పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
ఇందులో భాగంగా రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంస్థల (ఎఫ్‌పీఓలు) ద్వారా ఫైన్ ఫ్లేవర్ కోకో బీన్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. శాస్త్రీయ పద్ధతుల్లో ఫెర్మెంటేషన్, డ్రైయింగ్, గ్రేడింగ్, నాణ్యత నియంత్రణపై శిక్షణలు అందించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కోకో బీన్స్ తయారీకి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోంది. ఫలితంగా రైతులు ఇప్పుడు ప్రీమియం మార్కెట్లకు చేరుకుని, మెరుగైన ధరలు పొందుతున్నారు.
రెండో దశగా బీన్-టు-బార్ చాక్లెట్ తయారీ యూనిట్లు, కోకో మాస్, కోకో బటర్, కోకో పౌడర్ తయారీ పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహం అమలు చేస్తోంది. ఆర్థిక సాయం, సాంకేతిక శిక్షణ, బ్రాండింగ్, మార్కెటింగ్, జాతీయ స్థాయి ప్రదర్శనల్లో భాగస్వామ్యం వంటి సహకారాన్ని అందిస్తోంది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 17 కోకో ప్రాసెసింగ్, చాక్లెట్ తయారీ యూనిట్లు ఏర్పాటుకు మొత్తం రూ.3.70 కోట్ల పెట్టుబడి, రూ.1.13 కోట్ల ఆర్థిక సహాయం అందించారు. 2026-27లో మరో 16 యూనిట్ల ఏర్పాటుకు రూ.5.50 కోట్ల పెట్టుబడితో పాటు రూ.1.70 కోట్ల సబ్సిడీ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
లోకల్ బ్రాండ్లకు జాతీయ బ్రాండింగ్
గోదావరి కోకో, నూయి చాక్లెట్స్, వెస్ట్-ఇన్ చాక్లెట్స్, స్లో బీన్, చోకో టేల్స్ వంటి స్వదేశీ బ్రాండ్లు ఆంధ్రప్రదేశ్ కోకోతోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన చాక్లెట్లు తయారు చేస్తూ గుర్తింపు పొందుతున్నాయి. అలాగే బాన్ ఫిక్షన్ బ్రాండ్ అంతర్జాతీయ స్థాయిలో అకాడమీ ఆఫ్ చాక్లెట్స్ (యూకే), కాకావో ఆఫ్ ఎక్సలెన్స్, ఇంటర్నేషనల్ చాక్లెట్ సలోన్ (అమెరికా) వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించి రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపాయి.
ఫైన్ ఫ్లేవర్ కోకో, ప్రీమియం చాక్లెట్లు, కోకో పదార్థాల తయారీలో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోకో సిటీ, కోకో అనుభవ కేంద్రం (ఎక్స్‌పీరియన్స్ సెంటర్) ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ప్రీమియం చాక్లెట్లకు డిమాండ్…
సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాసరావు కొండపాటి మాట్లాడుతూ, ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కోకో బీన్స్ సరఫరా చేసే రాష్ట్రంగా మాత్రమే ఉండేదన్నారు. ఇకపై ప్రపంచస్థాయి ప్రీమియం చాక్లెట్లు, కోకో ఉత్పత్తుల తయారీలో కూడా రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు పొందాలనేదే లక్ష్యం అన్నారు.
రైతులకు అధిక ఆదాయం అందించే మార్గం విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ అని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, పారిశ్రామికవేత్తల భాగస్వామ్యం, ప్రీమియం చాక్లెట్లకు పెరుగుతున్న మార్కెట్ డిమాండ్తో ఆంధ్రప్రదేశ్ కోకో పరిశ్రమ కొత్త దశలోకి అడుగుపెడుతోంది.
వెస్ట్-ఇన్ చాక్లెట్స్‌కు కొత్త గుర్తింపు
రాజమహేంద్రవరానికి చెందిన వెస్ట్-ఇన్ చాక్లెట్స్ ఈ మార్పుకు ప్రతీకగా నిలుస్తోంది. 2024లో శ్రీనివాసరావు కొండపాటి స్థాపించిన ఈ సంస్థ కోకో సాగు నుంచి ప్రీమియం చాక్లెట్ల తయారీ వరకు పూర్తి విలువ గొలుసును ఒకే చోట అభివృద్ధి చేసింది.
దవళేశ్వరం సీ-1 ఇండస్ట్రియల్ పార్క్‌లో సుమారు రూ.6 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏడాదికి 450 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ ప్రాసెసింగ్ సామర్థ్యం ఉంది. కోకో మాస్, కోకో బటర్, కోకో పౌడర్‌తో పాటు డార్క్ చాక్లెట్లు, మిల్క్ చాక్లెట్లు, చాక్లెట్ స్ప్రెడ్స్, చాక్లెట్ చిప్స్, హాట్ చాక్లెట్ పౌడర్, కోటెడ్ నట్స్, ప్రైవేట్ లేబుల్ చాక్లెట్లను తయారు చేస్తోంది.
ఈ సంస్థ ప్రస్తుతం రాష్ట్రంలోని వెయ్యికి పైగా కోకో రైతుల నుంచి ఏటా సుమారు 900 మెట్రిక్ టన్నుల కోకో బీన్స్ సేకరిస్తోంది. రైతులకు నాణ్యత ఆధారిత ధరలు అందిస్తూ, స్థానికంగా విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 15 మందికి ఉపాధి కల్పిస్తున్న వెస్ట్-ఇన్ చాక్లెట్స్‌లో 12 మంది మహిళలే కావడం విశేషం.
దేశీయ మార్కెట్‌తో పాటు యునైటెడ్ కింగ్‌డమ్, అమెరికా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఫార్మ్ టు ఫైన్ ఫ్లేవర్ కోకో… బీన్ టు బార్ చాక్లెట్ అనే లక్ష్యంతో రాష్ట్రం దేశంలోనే ప్రముఖ ప్రీమియం చాక్లెట్ తయారీ కేంద్రంగా ఎదుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి చిరంజీవ్ చౌదరి గోదావరి జిల్లాల్లో కోకో సిటీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
