కార్యకర్తలు–నాయకుల కలయికే మహానాడు

కార్యకర్తలు–నాయకుల కలయికే మహానాడు
- ఎంపీ కేశినేని చిన్ని
నందిగామ, ఆంధ్రప్రభ:
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమం కార్యకర్తల కొలాహలం మధ్య ఘనంగా జరిగింది. మహానాడు కార్యక్రమం అంటే టీడీపీ కార్యకర్తల పండుగ అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, నందిగామ ఎమ్మెల్యే భారీ మెజారిటీతో గెలవడానికి కారణం నియోజకవర్గ ప్రజలేనని తెలిపారు. టీడీపీలో నాయకులు వస్తూ పోతూ ఉంటారని, కానీ పార్టీని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉన్నది కార్యకర్తలేనని అన్నారు.
కోటి మంది కుటుంబ సభ్యులు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
అధికారం ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం, అధికారం లేనప్పుడు ప్రజా సమస్యలపై పోరాటమే టీడీపీకి తెలుసని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కొత్త వారికి అవకాశాలు కల్పిస్తోందని, ప్రతి కార్యకర్తకు రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యకర్తల భద్రతపై పార్టీ ప్రధాన నాయకుడు నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఆయన వెల్లడించారు. నందిగామ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని తో పాటు స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ చైర్మన్ కోట వీరబాబు, నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు, నియోజకవర్గ పరిశీలకుడు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్ తదితరులు పాల్గొన్నారు.

