విద్యతోనే భవిష్యత్ నిర్మాణం
విద్యతోనే భవిష్యత్ నిర్మాణం
ఆడపిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి
పదో తరగతి టాపర్లకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఘన సన్మానం
కర్నూలు బ్యూరో, మే 14, ఆంధ్రప్రభ: విద్య ద్వారానే కుటుంబాలతో పాటు భావితరాల అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణతో లక్ష్యసాధన వైపు ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లల విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.
గురువారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ శాలువాలతో సన్మానించి, మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలో టాపర్లుగా నిలిచిన 49 మంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో బాలికలు బాలుర కంటే 11 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించడం ఆనందకర విషయమన్నారు. అదే సమయంలో బాలురు కూడా మరింత కృషి చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. తాను కర్నూలు జిల్లాకు వచ్చినప్పుడు అక్షరాస్యత శాతం కేవలం 57 శాతమే ఉండేదని, విద్యపై అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
“విద్య అనేది జీవితాన్ని మార్చే శక్తి” అని పేర్కొన్న కలెక్టర్, మంచి విద్యతోనే మంచి ఉద్యోగాలు, ఉన్నత భవిష్యత్ సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలు జిల్లాలో కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను పదో తరగతి వరకు మాత్రమే చదివించి త్వరగా వివాహం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఫీడ్‌బ్యాక్ ద్వారా తెలిసిందన్నారు. “పెళ్లి ఒక్కటే జీవిత లక్ష్యం కాదు” అని స్పష్టం చేస్తూ, ఆడపిల్లలకు సాధ్యమైనంత ఉన్నత విద్య అందించాలని కోరారు.
ప్రస్తుత కాలంలో చిన్న చిన్న కారణాలకే విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మెలిగి, వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలకు వెళ్లకుండా ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు సూచించారు.
సామాజిక మాధ్యమాలను మంచికే వినియోగించాలని, వాటి ద్వారా విజ్ఞానం, కెరీర్ మార్గదర్శకత్వం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ ఆసక్తులు, ప్రతిభకు అనుగుణంగా లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై బలవంతంగా రుద్దకుండా, వారి అభిరుచులను ప్రోత్సహించాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి జి. సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 71.08గా నమోదైందన్నారు. అందులో బాలురు 65.62 శాతం, బాలికలు 76.94 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. మొత్తం 23,836 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 500కు పైగా మార్కులు సాధించిన వారి సంఖ్య 6,021కు చేరిందన్నారు.
“100 డేస్ యాక్షన్ ప్లాన్”ను సమర్థవంతంగా అమలు చేయడం, జిల్లా కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ, మార్గదర్శకత్వం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
వివిధ విద్యాసంస్థల ఫలితాలను వెల్లడిస్తూ.. ఏపీ రెసిడెన్షియల్ సంస్థలు 99.24 శాతంతో అగ్రస్థానంలో నిలిచాయని తెలిపారు. బీసీ వెల్ఫేర్ పాఠశాలలు 97.12 శాతం, ప్రైవేట్ పాఠశాలలు 91.43 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు 83.33 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు 60.63 శాతం, మున్సిపల్ హైస్కూల్స్ 58.50 శాతం, జిల్లా పరిషత్ పాఠశాలలు 58.48 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ లోకరాజు, ఉప విద్యాశాఖాధికారులు రాజేంద్ర ప్రసాద్, శ్రీధర్ బాబు, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
