virat kohli| అప్పుడు.. ఇప్పుడు.. అదే జోరు
virat kohli| అప్పుడు.. ఇప్పుడు.. అదే జోరు
రికార్డుల రారాజు కోహ్లీ
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్లో రికార్డుల గురించి చెప్పుకోవాలంటే సమయం సరిపోదు.. రాయాలంటే బుక్కే సరిపోదు. విరాట్ కోహ్లి ఆటకు రికార్డులు సలాం కొట్టాల్సిందే. ఆయన ఆడిన ప్రతీ మ్యాచులో రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. 37ఏళ్ల వయసులోనూ అద్భుతంగా ఆడుతూ అభిమానులను అలరిస్తున్నారు. అందుకే ఆయనకు రికార్డుల రారాజు.. చేజింగ్ మాస్టర్‌గా పేరొందాడు. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ, అంతర్జాతీయ వన్డే మ్యాచులు మాత్రమే ఆడుతున్నాడు. ఇటు ఐపీఎల్‌లోనూ ఆడుతూ తన దూకుడు ప్రదర్శిస్తూ బెంగళూర్ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించిన కింగ్ కోహ్లీ నిన్న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి తనలో ఇంకా చావ తగ్గలేదని నిరూపించుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లి.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఐపీఎల్ 2026 సీజన్లోనూ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రాయ్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లి సెంచరీ నమోదు చేశాడు. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి వన్ మ్యాన్ షోతో 19.1 ఓవర్లలో విజయం సాధించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన కోహ్లి, 58 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచి ముగింపు వరకూ క్రీజులోనే కొనసాగి నాటౌట్‌గా నిలిచాడు.
మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ… నా జీవితంలో నాకు తెలిసింది క్రికెట్ ఆడటమే. నాకు రికార్డుల మీద ఆశ లేదు. నాలో మిగిలి ఉన్న క్రికెట్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను. ఒకరోజు నా కెరీర్ ముగుస్తుంది. ఆ రోజు వరకు మైదానంలో ఉత్సాహంగా ఆడతాను అని కోహ్లీ వ్యాఖ్యానించాడంటే ఆయనకు ఆటపై ఎంత అంకితభావం ఉందో అర్థం అవుతుంది.

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లి అత్యధికంగా తొమ్మిది సెంచరీలు నమోదు చేసిన మొనగాడిగా నిలిచాడు. 2008లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చి కోహ్లి 2016 వరకూ ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 2016లో ఏకంగా నాలుగు సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. 2019లో ఒకటి, 2023లో రెండు, 2024లో ఒకటి చేశాడు. 2024 తర్వాత రెండేళ్ల గ్యాప్‌లో మళ్లీ ఈ ఏడాది మరో సెంచరీ చేసి మొత్తం 9 శతకాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

కోహ్లీ మరికొన్ని రికార్డులు
టీ20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.
279 మ్యాచ్‌లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును కోహ్లీ అధిగమించాడు.
కేవలం 60 బంతుల్లో 105 పరుగులు (నాటౌట్) చేసి జట్టుకు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు.

