14thMaychintana | భగవద్గీతలో మనసు నియంత్రణపై శ్రీకృష్ణ బోధనలు
14thMaychintana | భగవద్గీతలో మనసు నియంత్రణపై శ్రీకృష్ణ బోధనలు
14thMaychintana | ప్రతికూల ఆలోచనలు ఎందుకు వస్తాయి?
మానసిక బలహీనత నుంచి బయటపడే మార్గాలు
ధ్యానం, సానుకూల దృక్పథంతో మానసిక ప్రశాంతత
ప్రతికూల భావనలపై గెలిచి విజయవంతమైన జీవితం
14thMaychintana | సాధారణంగా మనలో అనుకూల భావనలు, ప్రతికూల భావనలు కలుగుతుంటాయి. ఎక్కువమందికి ప్రతికూల భావనలు వస్తూంటాయి. దాంతో భయం భయంగా కాలాన్ని గడుపుతుంటారు. రూపాయికి బొమ్మ-బొరుసు ఉన్నట్లే మనలో ప్రతికూల-అనుకూల భావనలు వస్తుంటాయి. ప్రతికూల ఆలోచనలు భార్యాభర్తలు ఒకరిపై మరొకరికి అనుమానం ఉన్నప్పుడు, పిల్లలు స్కూలు లేదా కాలేజీ నుంచి ఆలస్యంగా రావడం, ఇంట్లో పెద్దలకు తెలియకుండా అసాంఘిక కార్యకలాపాలు చేయడం వంటి పరిస్థితుల్లో మన ఆలోచనలు నెగెటివ్‌గానే ఉంటాయి. అటువంటి ఆలోచనల్లో ఉన్నప్పుడు జీవితాన్ని స్వేచ్ఛగా, ఆనందంగా ఆస్వాదించలేరు. భయం గుప్పెట్లో జీవిస్తూ ఉంటారు. అసలు ఇటువంటి ప్రతికూల ఆలోచనలు ఎందుకు కలుగుతాయి? వాటిని దూరం చేసుకొని, అనుకూల భావాలతో ఉండాలంటే ఏమి చేయాలో పరిశీలిద్దాం.

భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ… “ఇంద్రియాణాం హి చరతాం యన్మనోను విధీయతే | తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి” అన్నారు. అంటే యథేచ్ఛగా అనేక విషయాలతో సంచరించే మనసు, సముద్రంలో పెనుగాలి తాకిడికి నావ నశించినట్లు మనసు కూడా నశించిపోతుంది అని. అందుకే మనలో ప్రతికూల ఆలోచనలు మనసును అల్లకల్లోలం చేస్తుంటాయి. అందుకే మనసును నిగ్రహింప చేయాలి. లేకపోతే మానసిక రోగిగా తయారయ్యే ప్రమాదం ఉంది.
మనలో ప్రతికూల ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆలోచిస్తుంటే కారణాలు:
- మానసిక బలహీనత.
- కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు లోపించడం.
- సమాజంలోని వారు, తన చుట్టూ ఉన్న వారు తనకు గుర్తింపు, మాటకు విలువ ఇవ్వటంలేదనే సంకుచిత మనస్తత్వం.
- వ్యక్తులమీదో, వస్తువుల మీదో విపరీతమైన వ్యామోహం/అభిమానం పెంచుకోవడం వల్ల.
- పరిసరాల్లో కానీ, మాధ్యమాల వల్ల కానీ గ్రహించిన దుర్ఘటనలు.
- ఆత్మన్యూనతా భావం వల్ల అసంతృప్తి జీవనం.
- స్వేచ్ఛ లేకపోవడం.
ఇలా అనేక కారణాల వల్ల మనసు అల్లకల్లోలమై ప్రతికూల భావనల వైపు వెడుతుంది. ఇంగ్లాండ్‌కు చెందిన ప్రముఖ మానసిక తత్త్వశాస్త్రవేత్త డాక్టర్ ఎమైల్ మాటల్లో… “చెడు భావనలు మనసులో తిష్ఠ వేస్తున్నప్పుడు, మనసును మంచి భావాల వైపు మరల్చినపుడు అవి నెమ్మదిగా తగ్గుతాయి!” అన్నారు.
ఈ ప్రతికూల ఆలోచనల వల్ల భయం, భయం వల్ల సంశయం, దానివల్ల ద్వేషం, ద్వేషం వల్ల పతనం సంభవిస్తాయి. అందుకే అటువంటి భావనల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు:
- అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇంట్లో వారు కానీ, బయట వారు కానీ మాట్లాడుకొంటున్న సందర్భంలో మధ్యలో కల్పించుకోవడం వల్ల, అవతల వారు ఆ విషయాన్ని పట్టించుకోనప్పుడు, ఆత్మన్యూనతా భావం కలుగుతుంది. ఏదో పోగొట్టుకున్న ఆలోచన కలుగుతుంది.
- ఖాళీగా ఉండకుండా మంచి సంగీతం వినడం ద్వారా, ఆధ్యాత్మిక మహర్షులకు సంబంధించిన పుస్తకాలు చదవడం ద్వారా, పెరట్లో కానీ, డాబా మీద కానీ మొక్కలు పెంచుతూ సంరక్షణ చేయడం, ప్రక్క వారికి సహాయం అందించడం.
- ఇతరులతో మన ప్రవర్తన ఎలా ఉంది? గుర్తించి, సానుకూల దృక్పథం కలిగి ఉండడం.
- ధ్యానం, ప్రాణాయామం చేయడం ద్వారా మనసును అదుపులో ఉంచుకోవచ్చు.
- సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకుండా ఉండడం. ఇటువంటి పద్ధతుల వల్ల ప్రతికూల ఆలోచనల నుంచి బయటపడవచ్చు.
భగవద్గీత ఆరవ అధ్యాయంలోని ఒక శ్లోకంలో “క్రమశిక్షణ లోపించిన మనసు శత్రువుగాను.. సుశిక్షితమైన మనసు స్నేహితునిగాను వ్యవహరిస్తుంది” అని చెప్పారు.
సీతాదేవిని లంకలో హనుమ వెతుకుతూ, కనపడకపోయే సరికి, ఆయనలో ప్రతికూల ఆలోచన వచ్చి, ఆత్మహత్య చేసుకుందామనే స్థాయికి వెళ్లి, కర్తవ్యాన్ని పునరాలోచించి విరమించి, మళ్లీ ప్రయత్నించడం, సీతాదేవిని కనుగొనడం మనకు తెలిసిన విషయమే. ధృతరాష్ట్రుడు మనసులో అన్నీ ప్రతికూల ఆలోచనలే. అందుకే ఎప్పుడూ భయంగానే జీవించాడు.
కలిపురుషుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, లొంగక, సానుకూల ధోరణితో ఉండడం వల్లనే నలదమయంతుల జీవితం సుఖమయమైంది. కలిపురుషుడు దేవతల హెచ్చరికతో లొంగిపోయాడు.
భగవద్గీత 2-41 శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్పారు..
“వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన!
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయనామ్!!” అంటే నిశ్చలమైన లక్ష్యం కలవారి బుద్ధి ఏకాగ్రతతో ఉంటుంది. నిశ్చయమైన లక్ష్యం లేని వారి బుద్ధి పలువిధాలుగా చెదిరిపోతుంటుంది అన్నారు. అందుకే మనలోని ప్రతికూల భావనల నుంచి మనల్ని మనం రక్షించుకుందాం. భావి జీవితానికి పునాది వేద్దాం.
అనంతాత్మకుల రంగారావు
7989462679
