ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు

ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు
విజయవాడలో కలకలం.. అప్రమత్తమైన పోలీసులు
పాయకాపురం, ఆంధ్రప్రభ: విజయవాడ నగరంలో బుధవారం ఒక్కసారిగా కలకలం రేగింది. పైపుల రోడ్డులోని పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రయాణిస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
పైపుల రోడ్డు సర్కిల్ నుంచి జక్కంపూడి వెళ్లే ప్రధాన మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించడంతో కారులో ఉన్న వారు భయంతో వాహనాన్ని రోడ్డుపైనే వదిలేసి బయటకు దిగి పరుగులు తీశారు.
ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో స్థానిక ఆటో డ్రైవర్లు, ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మంటలు పెట్రోల్ బంక్ వైపు వ్యాపించకుండా ఉండేందుకు వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ఘటన షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా కారుకు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
