కాంటాలకు తాళం వేసిన రైతులు

కాంటాలకు తాళం వేసిన రైతులు

పాలకుర్తి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందిన వరి రైతులు ధాన్యం కొనుగోలు జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, ముందుగా ధాన్యం తీసుకొచ్చిన రైతులను పక్కనపెట్టి రికమండేషన్ ఉన్న వారికి తూకం వేస్తున్నారని ఆరోపిస్తూ పాలకుర్తి కొనుగోలు కేంద్రంలోని కాంటాలకు రైతులు తాళం వేశారు. పంటను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి రోజుల తరబడి ఎదురుచూస్తున్నా అధికారులు, నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతులు మండిపడ్డారు.

ధాన్యం తూకాలు ఆలస్యంగా వేయడం, వాహనాల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎండలు, అకాల వర్షాల కారణంగా ధాన్యం పాడై నష్టపోతామనే ఆందోళన వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ అన్యాయం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన రైతులు కొనుగోలు ప్రక్రియను అడ్డుకుని నిరసనకు దిగారు. ధాన్యం తూకాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, ముందుగా వచ్చిన రైతుల ధాన్యానికే ప్రాధాన్యం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.