మంగినపూడి బీచ్ రోడ్డులో స్వచ్ఛ పధం కార్యక్రమం
మంగినపూడి బీచ్ రోడ్డులో స్వచ్ఛ పధం కార్యక్రమం
పనులు పరిశీలించిన పంచాయతీ శాఖ అధికారి డిపిఓ
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం పరిధిలోని చిలకలపూడి రైల్వే ట్రాక్ నుండి పర్యాటక కేంద్రమైన మంగినపూడి బీచ్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు పంచాయతీ శాఖ నడుం బిగించింది. జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ధనలక్ష్మి నేతృత్వంలో బుధవారం ఉదయం భారీ స్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రహదారి వెంట ఉన్న వ్యర్థాలను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగించారు.
డీపీఓ నవీన్ మెటల్ కాలనీని సందర్శించిన సమయంలో స్థానిక ప్రజలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కాలనీలో నెలకొన్న పలు సమస్యలను అధికారి దృష్టికి తీసుకువచ్చారు
కుక్కల స్వైరవిహారం కాలనీలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని, రోడ్డుపై వెళ్లే వారిని వెంటాడి కరుస్తున్నాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. కుక్కల వల్ల వైరల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆవేదన చెందారు.
నీటి ఎద్దడి & డ్రైనేజి సరైన మంచినీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని, డ్రైనేజీ కాలువలు పూడికపోయి మురుగునీరు రోడ్లపైకి వస్తోందని ఫిర్యాదు చేశారు.
పరిశుభ్రత కరువు చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమల బెడద పెరిగిందని, తక్షణమే కాలనీలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
త్వరితగతిన పరిష్కరిస్తాం డీపీఓ హామీ
ప్రజల సమస్యలను సావధానంగా విన్న డీపీఓ స్పందిస్తూ నవీన్ మెటల్ కాలనీలో నెలకొన్న తాగునీరు, డ్రైనేజీ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా కుక్కల నివారణకు మరియు పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
