ఫాస్ట్ ట్రాక్ ఫారెస్ట్ చెక్పోస్ట్ ప్రారంభం
ఫాస్ట్ ట్రాక్ ఫారెస్ట్ చెక్పోస్ట్ ప్రారంభం
- జెండా ఊపిన ఖానాపూర్ ఎమ్మెల్యే
జన్నారం,ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్ ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ లోని హనుమాన్ టెంపుల్ ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన అటవీశాఖ ఫాస్ట్ ట్రాక్ చెక్పోస్ట్ ను నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం మధ్యాహ్నం పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అటవీ శాఖ పర్యావరణ సెస్సును ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్ ల ద్వారా వసూలు చేస్తుందన్నారు.
ఖానాపూర్ సెగ్మెంట్ లోని అన్ని సొంత వాహన యజమానులకు సెస్సు నుంచి మినహాయింపు ఉందని,ఇప్పటికీ వాహనాల నంబర్లు ఇవ్వనివారు ఎఫ్డీఓకు ఆధార్ కార్డుతో పాటు వాహన రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు అందజేయాలని ఆయన సూచించారు.
వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం అటవీ ప్రాంత రహదారుల గుండా 30 కి మించి వేగంగా వెళ్లకూడదన్నారు. అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు.ఆ తర్వాత మండలంలోని పొనకల్- బాదంపల్లి గ్రామాల మధ్య రూ.1.54 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. మోర్రిగూడలో పోచమ్మ గుడి దేవాలయాన్ని ఆయన ప్రారంభించారు.అనంతరం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణి చేశారు.ఆ తర్వాత తపాల్ పూర్ వద్ద అటవీ శాఖ ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్టును మంచిర్యాల డీఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎఫ్డీఓ రామ్మోహన్, తహసీల్దార్ బక్కయ్య,ఎంపీడీవో ఉమర్ షరీఫ్,తాళ్లపేట,ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు సుష్మారావు, లక్ష్మీనారాయణ,వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ లక్ష్మీనారాయణ,పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి,ఇందనపల్లి, పొనకల్,మొర్రిగూడ సర్పంచులు జక్కు సుష్మ- భూమేష్,జి.శంకర్,టి.విజయ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్,తదితరులు పాల్గొన్నారు.
