పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

పుట్టపర్తిలో యుద్ధ విమానాల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

  • స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీరా మహంతి

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు, ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ( డి ఆర్ డి ఓ ) ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు సంబంధిత అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దేశ రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రాజెక్టు పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు కానుండటం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది. యుద్ధ విమానాల తయారీతో పాటు వాటి పరీక్షల కోసం అత్యాధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి ఊతం లభించనుంది.

ప్రాజెక్టు స్థాపనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మీరా మహంతి శుక్రవారం పుట్టపర్తి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పరిశ్రమ ఏర్పాటుకు అనువైన భూభాగం, రవాణా సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు, విమాన పరీక్షలకు అనుకూల పరిస్థితులను ఆమె సమీక్షించినట్లు తెలిసింది. సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు.

ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి కొత్త ఊపిరి లభించనుంది. వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా అనుబంధ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రక్షణ రంగానికి చెందిన ఇలాంటి భారీ ప్రాజెక్టు రాయలసీమ ప్రాంతానికి రావడం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.