అభివృద్ధి శూన్యం.. అవినీతే అజెండా

అభివృద్ధి శూన్యం.. అవినీతే అజెండా

  • వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ధ్వజం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: నందికొట్కూరు మున్సిపాలిటీ అవినీతికి నిలయంగా మారిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేశారని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డా. సుదీర్ దారా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డిని కలిసి పట్టణ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.

కమిషన్.. కలెక్షన్.. కరప్షన్!
అనంతరం డా. సుదీర్ దారా మాట్లాడుతూ.. టీడీపీ నేతలపై నిప్పులు చెరిగారు. “మున్సిపాలిటీలో అభివృద్ధి పక్కనపెట్టి, కేవలం పర్సెంటేజీల కోసమే నేతలు పాకులాడుతున్నారు. ఇద్దరు వ్యక్తులను ప్రత్యేకంగా నియమించి, సాయంత్రం 6 గంటలవ్వగానే కమిషనర్ వద్ద కమిషన్లు వసూలు చేసి పార్టీ పెద్దల జేబులు నింపుతున్నారు. పర్సెంటేజ్ ఇవ్వడం లేదన్న నెపంతో మున్సిపాలిటీలోని ఒక గదికి తాళం వేసి మరీ దౌర్జన్యంగా వసూళ్లు చేస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు” అని ఆరోపించారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
వైఎస్ఆర్సీపీ హయాంలో నందికొట్కూరు మున్సిపాలిటీలో రూ. 59 కోట్లతో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన గుర్తు చేశారు. “స్థానిక ఎమ్మెల్యే ఈ రెండున్నరేళ్లలో ఏం చేశారో చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా. కేజీ రోడ్డుపై మంజూరైన డివైడర్ పనులను కూడా పర్సెంటేజీల కోసమే అడ్డుకుంటున్నారని” విమర్శించారు.

షాదీఖానాపై నిర్లక్ష్యం – పవన్ కళ్యాణ్‌పై సెటైర్
ముస్లిం మైనారిటీల కోసం తమ ప్రభుత్వంలో పూర్తి చేసిన షాదీఖానాను టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఎందుకు ప్రారంభించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “ఒక్క పెళ్లి కాదు మూడు పెళ్లిళ్లు చేసుకోండని చెప్పే పవన్ కళ్యాణ్ గారు, మా పేద ముస్లింలు ఒక్క పెళ్లి చేసుకోవడానికి కనీసం షాదీఖానాను ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

ప్రజల సమస్యలే నా అజెండా
పట్టణంలో డంపింగ్ యార్డ్ సమస్య కారణంగా కుమ్మరిపేట, బైరెడ్డి నగర్, వాల్మీకి నగర్, వడ్డేపేట కాలనీవాసులు కాలుష్యంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఏబీఎం పాలెం దళిత కాలనీలో మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఎంపీ వర్గం, ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవలతో ప్రజలకు కుళాయిలు కూడా అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు.

ఇకపై ప్రతి వార్డుకు వెళ్లి ప్రజల పక్షాన పోరాడుతానని, సమస్యల పరిష్కారం వరకు విశ్రమించబోనని డా. సుదీర్ దారా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply