బూనీల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉద్రిక్తత

బూనీల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఉద్రిక్తత

ట్రస్ట్ సభ్యుల ప్రమాణస్వీకారంపై రాజకీయ దుమారం..
గుడి వద్ద భారీగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు

భూపాలపల్లి రూరల్ , ఆంధ్రప్రభ ప్రతినిధి : భూపాలపల్లి మంజూరు నగర్ లోని బూనీల శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. ఆలయ నిర్మాణ పనులు పూర్తికాకముందే ఎండోమెంట్స్ శాఖ ఆధ్వర్యంలో ట్రస్ట్ కమిటీ సభ్యుల నియామకం, ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టడంపై బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇటీవల ఎండోమెంట్స్ శాఖ నలుగురు సభ్యులను ఆలయ ట్రస్ట్ కమిటీ సభ్యులుగా నియమించగా, శుక్రవారం వారి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో గుడి ప్రాంగణం వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆలయ నిర్మాణం పూర్తికాకముందే కమిటీ ఏర్పాటు ఎందుకు?”, స్థానిక భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారా? అంటూ బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. మరోవైపు ప్రభుత్వం నిబంధనల ప్రకారమే చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటూ కార్యక్రమానికి మద్దతు తెలిపారు.

గుడి వద్దకు భారీగా చేరుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు..

కాంగ్రెస్ , బీఆర్ ఎస్ రెండు వర్గాల నాయకులు గుడి వద్ద ఎదురెదురుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో పోలీసుల పహారా కొనసాగుతుండగా, పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

ట్రస్ట్ సభ్యుల ప్రమాణస్వీకారం ప్రశాంతంగా జరుగుతుందా..?లేక నిరసనల మధ్య వాయిదా పడుతుందా అన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.