జనగణన-2027పై అవగాహన సదస్సు..

జనగణన-2027పై అవగాహన సదస్సు..
- ఎల్లంపేటలో మున్సిపల్ లో ఘనంగా 2కే రన్ ప్రారంభం..
మేడ్చల్, ఆంధ్రప్రభ ; కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనగణన-2027 (Census-2027) కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో ‘స్వీయ గణన’ (Self Enumeration) ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉదయం 2కే మారథాన్ రన్ నిర్వహించారు. ఎల్లంపేట మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి,చైర్‌పర్సన్ లావుడియా శ్రీదేవి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ స్థానిక వివేకానంద విగ్రహం నుండి ప్రారంభమై ఎల్లంపేట బస్టాప్ వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు తమ వివరాలను తామే నమోదు చేసుకునే ఈ ‘స్వీయ గణన’ విధానంపై అవగాహన కలిగి ఉండాలని, తద్వారా పారదర్శకమైన గణాంకాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
డ్వాక్రా సంఘాల మహిళలు, యువజన సంఘాల సభ్యులు స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జనగణనతోనే ప్రజా సంక్షేమం అనే లక్ష్యంతో ఈ అవగాహన ర్యాలీ సాగింది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన ఈ వినూత్న అవగాహన కార్యక్రమం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
