​జి+2 అనుమతితో జి+4 నిర్మాణం…

​జి+2 అనుమతితో జి+4 నిర్మాణం…

  • నిబంధనలు తుంగలో తొక్కి..
  • టౌన్ ప్లానింగ్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం..

మేడ్చల్, ఆంధ్రప్రభ : సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ మేడ్చల్ డివిజన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం అనుమతులు పొందాల్సిన యజమానులు, అధికారుల కళ్లు గప్పి వారి అండదండలతో భారీ భవంతులను నిర్మిస్తున్నారు. తాజాగా మేడ్చల్ సర్కిల్ పరిధిలోని అయ్యప్ప స్వామి దేవాలయ సమీపంలో ఒక భారీ అక్రమ నిర్మాణం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. అయ్యప్ప దేవాలయ ప్రాంతంలో ఒక భవన నిర్మాణానికి కేవలం జి+2 (గ్రౌండ్ ప్లస్ రెండు) కు మాత్రమే అనుమతి ఉన్నట్లు సమాచారం. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా జి+4 (నాలుగు అంతస్తులు) నిర్మించేశారు. ప్రస్తుతం ఈ భవనానికి సంబంధించిన ఇటుక పని (బ్రిక్ వర్క్) వేగంగా సాగుతోంది. నిబంధనల ప్రకారం వదిలిపెట్టాల్సిన ‘సెట్ బ్యాక్’ స్థలాన్ని కూడా వదలకుండా నిర్మాణం చేపట్టినట్లు స్పష్టమవుతోంది.
​అధికారుల మౌనంపై విమర్శలు
ఇంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణం జరుగుతున్నా మేడ్చల్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులకు సమీపంలోనే ఇలాంటి ఉల్లంఘనలు జరుగుతున్నా, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన అధికారులు ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అనుమతి లేని అంతస్తుల వల్ల భవిష్యత్తులో ఇతర నివాసితులకు ఇబ్బందులు కలగడమే కాకుండా, మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు , మేడ్చల్ సర్కిల్ జోనల్ కమిషనర్ స్పందించి, ఈ అక్రమ నిర్మాణంపై విచారణ జరిపి తక్షణమే పనులు నిలిపివేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు