కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్గల్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి విజేత మరియు ఎంపీడీఓ సంతోష్ కుమార్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని కిచెన్, డైనింగ్ హాల్, వాష్రూమ్స్, తాగునీటి సౌకర్యాలు, నివాస హాస్టల్ గదులు, పరిశుభ్రత నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు.
విద్యార్థినులకు అందుతున్న ఆహారం నాణ్యత, మెనూ అమలు, ఆరోగ్యకరమైన వాతావరణం, భద్రతా చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో ఆత్మీయంగా ముచ్చటించిన అధికారులు, వారికి అందుతున్న విద్యాబోధన, పాఠ్యపుస్తకాలు, హాస్టల్ సౌకర్యాలు, ఉపాధ్యాయుల బోధన, క్రీడలు, ఇతర సహపాఠ్య కార్యక్రమాల గురించి వివరాలు తెలుసుకున్నారు.
విద్యార్థినులు చదువుపై పూర్తి దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో మౌలిక వసతులు, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, కేజీబీవీ ఇన్చార్జి అధికారి రాణి, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
