weather Iకూలీల ప్రాణాలను బలితీసుకున్న పిడుగు

weather I కూలీల ప్రాణాలను బలితీసుకున్న పిడుగు

weather I జి.సిగడాం (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : ప్రకృతి ప్రకోపానికి ఆ నిరుపేద కుటుంబాల్లో పెను విషాదం నిండింది. రెక్కాడితే గానీ డొక్కాడని ఆ కూలీల జీవితాల్లో పిడుగు పెను నిప్పు పోసింది. పొలంలో పని ముగించుకుని ఇంటికి వెళ్దామనుకునే లోపే, మృత్యువు పిడుగు రూపంలో వచ్చి ముగ్గురు మహిళలను కబళించింది. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం గెడ్డవలస గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికులను కన్నీరుమున్నీరు చేస్తోంది.

గెడ్డవలస గ్రామానికి చెందిన మజ్జి సత్యవతి (52), మజ్జి అప్పల నరసమ్మ (50) వరుసకు తోడికోడళ్లు. వీరితో పాటు అదే గ్రామానికి చెందిన పైల రాము (42) కలిసి మంగళవారం ఉదయం దొండ పాదుల పనుల కోసం పొలానికి వెళ్లారు. రోజంతా కష్టపడి, సాయంత్రం 5 గంటల సమయంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరదామనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో గర్జించింది. భారీ శబ్దంతో వారు ఉన్న చోటే పిడుగు పడటంతో, ఆ ముగ్గురు మహిళలు తేరుకునే లోపే విగతజీవులుగా పడిపోయారు. ప్రాణం పోయినా ఒకరిని ఒకరు వీడని స్థితిలో అక్కడికక్కడే మృతి చెందడం చూసిన వారిని కలిచివేసింది.

ఒకే కుటుంబంలో ఇద్దరు.. గ్రామంలో మిగిలిన విషాదం

తోడికోడళ్లు అయిన సత్యవతి, అప్పల నరసమ్మ ఇద్దరూ ఒకేసారి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అటు పైల రాము కుటుంబం కూడా పెద్ద దిక్కును కోల్పోయి రోదిస్తోంది. చేతికంది వచ్చిన వారు విగతజీవులుగా పడి ఉండటం చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

సమాచారం అందిన వెంటనే జి.సిగడాం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.